హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలకు వరదలు సంభవించి దాదాపు 100 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోగా, కోట్లలో ఆర్థిక నష్టం జరిగిన విషయం తెలిసిందే. వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం అండగా నిలిచింది. రాష్ట్రం వరద ప్రభావం నుంచి కోలుకోవడానికి రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు.
రూ.180.40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ (ఎస్డీఆర్‌ఎఫ్)కి కేటాయించారు. వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం హిమాచల్ ఎస్డీఆర్‌ఎఫ్‌కి 2023-24 సంవత్సరంలో విడుదల చేయాల్సిన సహాయ నిధిని ముందుగా విడుదల చేయనున్నట్లు అధికారక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే జులై 10న మొదట విడత కింద రూ.180.40 కోట్లను విడుదల చేసింది.
అయితే రూ. 2000 కోట్లను తాత్కాలిక సహాయంగా అందించాలని అంతకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కేంద్రాన్ని కోరారు. భారీ వర్షాలు కారణంగా అన్ని నదులూ ఉప్పొంగాయి.రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అమిత్ షాతో మాట్లాడానని, తాత్కాలిక సహాయంగా రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్లు సుఖు తెలిపారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల సుమారు రూ. 4,000 వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 1 లక్ష నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అయితే ఆ పరిహారాన్ని పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి బాధితుడికి రూ. 5వేలు ఇస్తున్నారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని, తమ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షం పడుతోంది. దాంతో లోయలు, కొండలతో కూడిన చార్‌ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా యుమునోత్రి, బద్రీనాథ్ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. వర్షాల కారణంగా చామి పట్టణ సమీపంలో యమునోత్రి హైవే 123 పై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ హైవేను పూర్తిగా మూసివేశారు.
అదేవిధంగా బద్రీనాథ్ మార్గంలో కూడా వర్షాలవల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. చమోలీ జిల్లాలో పలుచోట్ల హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ మార్గాన్ని కూడా తాత్కాలికంగా మూసివేశారు. పితోరగఢ్ జిల్లాలో కూడా దార్చులా-తవాఘాట్-లిపులేఖ్ రహదారిలోని ఐదారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. దాంతో ఆ రహదారిని కూడా మూసివేశారు.
దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే వరదలతో అల్లాడుతుండగా.. ఢిల్లీలో రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అదేవిధంగా కొన్ని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో జూలై 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు