అంతరిక్ష ప్రయోగాల్లో జపాన్ కు వరుసగా పరాజయాలు

భారతదేశం చంద్రయాన్ -3ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టిస్తే, అగ్రరాజ్యాలతో ఒకటైన జపాన్ వరుసగా అంతరిక్ష ప్రయోగాలలో పరాజయాలు ఎదుర్కొంటున్నది. ప్రపంచంలో అతి భారీ అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో ఒక‌టైన జపాన్‌కు మరోసారి అపజయమే ఎదురైంది. 
 
జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎప్సిలాన్‌ రాకెట్ ఇంజిన్‌ పరీక్షల స‌మ‌యంలోనే పేలిపోయింది. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇవాళ ఉదయం 9.50 నిమిషాలకు రాకెట్‌ ఇంజిన్‌ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి ఉదయం 9.57 గంటలకు జ‌పాన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటన చేసింది.

రాకెట్‌ను పరీక్షిస్తుండగా జ‌రిగిన ఈ ప్రమాదంలో ప్రాణ‌న‌ష్టం ఏమైనా జ‌రిగిందా అనే విష‌యంలో ఇప్పటివ‌ర‌కు స‌మాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్‌ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్’ పేరిట జ‌పాన్‌ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్‌ పరీక్షల దశలో పేలిపోయింది. 2022 అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ రాకెట్‌ను జ‌పాన్‌ ప్రయోగించింది. 

అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే రాకెట్‌ పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ఘటనకు సంబంధించిన చిత్రాలను జపాన్‌ జాతీయ మీడియా ప్రసారం చేసింది.