చంద్రయాన్-3తో మరోసారి తన సామర్థ్యాలను నిరూపిస్తున్న భారత్

కరోనా వ్యాక్సిన్ తయారీతో భారతదేశం సాధించిన విజయాలను  చంద్రయాన్ మరింత ముందుకు తీసుకు వెళ్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రయాన్ -3 ప్రపంచ స్థాయిలో భారతదేశం స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని చెబుతూ స్వదేశీ సామర్థ్యాలను వినియోగించి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి విజయం సాధించిన భారతదేశం చంద్రయాన్-3తో మరోసారి తన సామర్థ్యాలను నిరూపిస్తుందని చెప్పారు.

హైదరాబాద్ లో జరిగిన 11వ ఇండియా అలయన్స్ వార్షిక సదస్సు  2023 లో ముఖ్య  అతిథిగా పాల్గొంటూ శాస్త్ర  సాంకేతిక రంగాల్లో భారతదేశంతో కలిసి పనిచేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు వస్తున్నాయని  చెప్పడానికి ఈ సదస్సు ఒక నిదర్శనం అని తెలిపారు.  బయో మెడికల్ పరిశోధన రంగంలో  భారత దేశంలో బలమైన, ప్రపంచ-స్థాయి మానవ వనరులను అభివృద్ధి చేయడానికి కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూకేకు చెందిన వెల్‌కమ్ ట్రస్ట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు  ఇండియా అలయన్స్ ఏర్పాటయింది. 

గత 15 సంవత్సరాల కాలంలో భారతదేశ పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నిధులు సమకూర్చే అంశంలో ఇండియా అలయన్స్ కీలక పోషించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో బయోమెడికల్, క్లినికల్ రీసెర్చ్ వ్యవస్థల్లో ఇండియా అలయన్స్ ప్రభావవంతమైన మార్పు తీసుకు వచ్చిందని పేర్కొన్నారు.  

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2019లో ఇండియా అలయన్స్ టీమ్ సైన్స్ గ్రాంట్స్, క్లినికల్/పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్‌లను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ విభాగాలతో కలిసి  పరిశోధనలు ప్రారంభించిందని ఆయన తెలియజేశారు. భారత ప్రభుత్వం, వెల్‌కమ్ ట్రస్ట్ మధ్య కుదిరిన అవగాహనతో ఏర్పాటైన ఇండియా  అలయన్స్  15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని   చెబుతూ వివిధ  పథకాల ద్వారా నిధులు సమకూర్చి భారతదేశంలో పరిశోధన ప్రతిభను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.  

భారతదేశ పరిశోధన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే అంశంలో నిర్వహణ సామర్థ్యం కీలకంగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్   పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఇండియా అలయన్స్ కార్యక్రమాలతో 589 కి మించి  ఎక్కువ మంది పరిశోధనా శాస్త్రవేత్తలు ప్రయోజనం పొందారని తెలిపారు.  భారతదేశంలోని 48 నగరాల్లోని 137 విభిన్న సంస్థలకు ఇండియా అలయన్స్  నిధులు సమకూర్చిందని చెబుతూ  జాతీయ  అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే అంశంపై ఇండియా అలయన్స్  ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని  ఆయన తెలిపారు.

ఇండియా అలయన్స్ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి  దేశాల నుంచి భారతదేశానికి సహకారం అందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విదేశాల నుంచి అందిన సహకారంతో శాస్త్ర, పరిశోధన రంగాలు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు  అభివృద్ధి సాధించాయని వివరించారు.

దేశంలో పరిశోధనలు చేపట్టేందుకు టీమ్ సైన్స్ గ్రాంట్స్, క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ గ్రాంట్స్  ఆధ్వర్యంలో ఇండియా అలయన్స్ అంతర్జాతీయ స్థాయిలో, వివిధ సంస్థల మధ్య సమన్వయం సాధించి పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇటీవల వచ్చిన మహమ్మారి పరిశోధనలు చేపట్టగల సామర్థ్యం వైద్యులకు ఉండాలని గుర్తు చేసిందని పేర్కొన్నారు.

క్లినికల్, ప్రజారోగ్య రంగాలను పటిష్టం చేయడానికి ఇండియా అలయన్స్ అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఇండియా అలయన్స్ సహకారంతో చేపట్టిన పరిశోధనల వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు  ప్రత్యామ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

పోషక జీవ లభ్యతను  అంచనా వేయడానికి నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. రాబిస్ పరిశోధనలో వన్ హెల్త్ విధానం, క్షయవ్యాధి చికిత్స కోసం టెలి-హెల్త్    విధానం అందుబాటులోకి వచ్చాయని  డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.