యమునా నది వరదతో నీటి ముట్టడిలో రాజధాని ఢిల్లీ

 
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో యమునా నదిలో నీటిమట్టం భారీగా పెరగడంతో, ఢిల్లీలో యమున ప్రమాదకస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో రాజధాని ఢిల్లీ నగరం నీటి ముట్టడిలో చిక్కుకొంది. హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్నది. యమునా నీటిమట్టం 208.46 మీటర్లకు చేరడంతో ఢిల్లీలోని ఐటీఓలోకి వరద నీరు చేరింది.
 
దాంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరే దర్శనమిస్తున్నది. రాజ్‌ఘాట్‌ నుంచి కశ్మీర్‌ గేట్‌ వరకు వెళ్లే రహదారి జలమయమైంది. నగరం జల దిగ్భంధంలో చిక్కుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
 
మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు తోడు, హరియాణా నుంచి వచ్చిన వరద నీరు యమున నది ఉగ్ర రూపానికి కారణమయ్యాయి. వరద నీరు ఢిల్లీ లోని ఎర్ర కోటలోకి కూడా చేరింది. ఎర్ర కోటలో మోకాల్లోతు నీరు నిలిచింది. రైల్వే ట్రాకుల పైకి నీరు చేరడంతో, జులై 7 నుంచి జులై 15 మధ్య దాదాపు 300 ఎక్స్ ప్రెస్ రైళ్లను, 406 ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేశారు.
 
లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు తమ వస్తువులను సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఢిల్లీలోని పలు రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు.  కశ్మీరీ గేట్ మెయిన్‌ రోడ్‌, భైరో మార్గ్, ఐపీ ఫ్లైఓవర్, చంద్గి రామ్ అఖారా మధ్య మహాత్మా గాంధీ మార్గ్ – కాళీఘాట్ టెంపుల్, ఢిల్లీ సెక్రటేరియట్ మధ్య రోడ్డును మూసివేశారు.
మహాత్మా గాంధీ మార్గ్ – వజీరాబాద్ బ్రిడ్జి, చంద్గి రామ్ అఖారా మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మూతపడ్డాయి.  మరో వైపు యమునపై మెట్రో రైలు స్పీడ్‌ను తగ్గించారు. ముందు జాగ్రత్త చర్యగా నదిపై వంతెనల నుంచి వెళ్లే రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుస్తున్నాయని డీఎంఆర్‌సీ తెలిపింది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో సింగు, బదర్‌పూర్, లోని, చిల్లా సరిహద్దుల నుంచి వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. 
 
హర్యానా, హిమాచల్, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే బస్సులను సింగు సరిహద్దు వరకు మాత్రమే పరిమితం చేశారు. నిత్యావసరాలకు ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన వాహనాలకు మాత్రం అనుమతి ఇచ్చారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో వరద పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో.. ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర ప్రజలను కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని కోరారు. ఉద్యోగస్తులు ఇంటి నుంచే పని చేయాలని కోరారు. వర్షాలు, వరదల కారణంగా సోమవారం వరకు ఢిల్లీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
 
ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరుల కార్యాలయాలు నీట మునిగాయి. రాజ్‌ఘాట్ నుంచి సచివాలయం వరకు ఉన్న రోడ్డు కూడా మునిగింది. ఇండియా గేట్ పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడ్