బంగ్లా పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఈ ఏడాది తొలి టీ 20 సిరీస్ నెగ్గింది. బంగ్లాదేశ్ గ‌డ్డ‌పై రెండో టీ 20లో విజ‌యంతో సిరీస్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. స్వ‌ల్ప స్కోర్లు న‌మోదైన మ్యాచ్‌లో భార‌త్ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది.
 
ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ విజ‌యం దోబూచులాడిన పోరులో ష‌ఫాలీ వ‌ర్మ సంచ‌ల‌న బౌలింగ్‌తో జ‌ట్టును గెలిపించింది.  తద్వారా మరో మ్యాచ్‌ మిగిలుండగానే హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర సేన‌ 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. దీప్తి శర్మ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు’ అందుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన‌ భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్ర‌మే చేసింది. 
 
డాషింగ్ ఓపెన‌ర్ షఫాలీ వర్మ (19) టాప్‌ స్కోరర్‌ కాగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (0), జెమీమా రోడ్రిగ్స్‌ (8), స్మృతి మంధన (13), హర్లీన్‌ డియోల్‌ (6) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు సుల్తానా ఖాతూన్‌ 3, ఫాతిమా రెండు వికెట్లు పడగొట్టారు.  స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ తడబడింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 87 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (38) మాత్ర‌మే రెండంకెల స్కోరు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఆఖ‌రి ఓవ‌ర్ వర‌కూ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు కావాలి. కెప్టెన్‌ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ షఫాలీ వర్మ‌కు బంతి ఇచ్చింది. అయితే.. బంగ్లా జట్టు 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు మాత్రమే చేసింది.  తొలి బంతికి రాబియా రనౌట్‌ కాగా.. రెండో బంతికి నహిద క్యాచ్ ఔట‌య్యింది. నాలుగో బాల్‌కు ఫాతిమా రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టగా.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి మారూఫా స్టంపౌట్‌గా వెన‌దిరిగింది. దాంతో, భార‌త జ‌ట్టు 8 ప‌రుగుల‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

టాప్ -10లోకి దూసుకెళ్లిన హర్మన్‌

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ -10లోకి దూసుకెళ్లింది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ తిరిగి టాప్‌-10లో చోటు దక్కించుకుంది.  బంగ్లాదేశ్‌పై తొలి టీ20లో అజేయ హాఫ్‌ సెంచరీ(54)తో హర్మన్‌ప్రీత్ జ‌ట్టును గెలిపించింది. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆమె నాలుగు స్థానాలు మెరుగు పర్చుకొని 10వ‌ ర్యాంక్‌కు దూసుకెళ్లింది.  ఆస్ట్రేలియా బ్యాట‌ర్‌ తహ్లియా మెక్‌గ్రాత్‌ 784 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 
 
బెత్‌ మూనీ (777 పాయింట్లు), భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (728 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అద‌ర‌గొట్టింది. 733 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. మ‌రోవైపు ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్‌ సోఫియా ఎకెల్‌స్టోన్‌ (788 పాయింట్లు) అగ్రస్థానం సొంతం చేసుకుంది. 
 
బంగ్లాదేశ్‌పై రెండో టీ20లో బంతితో విజృంభించిన దీప్తి వచ్చే వారానిక‌ల్లా ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. బంగ్లాతో మంగళవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో దీప్తి మూడు వికెట్లు పడగొట్టింది. సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆమె ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకుంది.