అమరావతిపై అత్యవసర విచారణకు `సుప్రీం’ విముఖత

అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంను కోరగా నిరాకరించింది.  నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని తెలిపింది. 
 
డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యంకాదని సుప్రీం స్పష్టం చేసింది. అదే విధంగా అమరావతి రాజధానిగా కొనసాగాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా ధర్మాసనం తిరస్కరించింది. కాగా, ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.
 
దాంతో సెప్టెంబర్ నాటికి విశాఖపట్నంకు పరిపాలనా కార్యకలాపాలను తరలించి, అక్కడి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని అనుకొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ పరిణామం నిరాశే కలిగించింది. మరోవంక, అమరావతి రైతులు సహితం విచారణలో జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసును అత్యవసరంగా జరపాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించగా ఈ కేసును అత్యవసరంగా విచారించలేమని కోర్టు పేర్కొంది. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి అటు రైతులు, ఇటు ప్రభుత్వం, అలాగే  అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య పిటీషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

అంతకుముందు రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించారు

ఇక ఈ కేసుకు సంబంధించి కేంద్రం తన వైఖరి చెప్పాలంటూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసంది. దీనిపై స్పందించిన కేంద్రం..అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. అయితే ఏపీ ప్రభుత్వం ఆశించిన విధంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో.. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
డిసెంబర్‌కు కేసు వాయిదా పడినా , అదే నెలలో కోర్టుకు సెలవులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 2వరకు కోర్టు వెకేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరుగుతుందనే నమ్మకం లేదు. మరోవైపు డిసెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. దానితో రాజధాని అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన ఎన్నికల అంశాలలో ఒకటిగా చేసే అవకాశం ఉంది.