తిరుమలలో పార్వేట మండపం కూల్చివేత.. రాజాసింగ్ ఆగ్రహం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ చారిత్రక మండపాన్ని టీటీడీ అధికారులు కూల్చివేశారు . తిరుమల నుంచి పాపవినాశానికి వెళ్లే దారిలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన రాతి మండపం ఉంది. ఈ రాతి మండపాన్ని పూర్తిగా తొలిగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. 

ఈ రాతి మండపం స్థానంలో నూతన మండపాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. రాతి మండపం పైభాగంలో టీటీడీ ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలను తొలగించారు. కింద భాగంలో ఉన్న రాతి మండపంలో వాడకంలో లేని టీటీడీ వస్తు సామాగ్రిని ఉంచుతున్నారు. 

తిరుమల కొండపై ప్రధాన దేవాలయం చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటైన రాయల కాలం నాటి రాతి మండపాన్ని టీటీడీ అధికారులు కూల్చివేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి నూతన మండపం నిర్మించేందుకు దీన్ని కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. పార్వేట మండపం వెయ్యేళ్ల నాటిదని భక్తులు అంటున్నారు.

 తిరుమల నుంచి పాపనాశనానికి వెళ్లే మార్గంలో ఈ రాతి మండపం ఉంది. ఇందులో పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి ఉత్సవాలు నిర్వహించేది టీటీడీ. అయితే ఈ పై భాగాన్ని పూర్తిగా తొలగించారు. దీని స్థానంలో ఆకర్షణీయమైన నూతన మండపాన్ని నిర్శించనున్నట్లు టీటీడీ తెలిపింది.

తిరుపతిలోని శ్రీవారి పార్వేట మండపం కూల్చివేతపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 350 ఏళ్ల నాటి మండపాన్ని ఏ విధంగా కూలుస్తారని మండిపడ్డారు. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి పార్వేట మండపం కూల్చివేత హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ధ్వజమెత్తారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని స్పష్టం చేయసారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఏపీ వాసులది మాత్రమే కాదని, హిందువులందరిదని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. తిరుమలలో ఏం చేసినా చెల్లుతుందని అనుకోవడం సరైంది కాదని హెచ్చరించారు. 

పార్వేట మండపం కూల్చివేతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను రాజాసింగ్ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిస్తే సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామని స్పష్టం చేశారు. అడిగే వారు లేరన్నట్లు ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. పురాతన మండపానికి మరమ్మత్తులు చేయకుండా కూల్చటం ఏంటని ప్రశ్నించారు.