మొత్తం ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన అంతరిక్ష నౌక చంద్రయాన్-3 ప్రయోగం కోసం శ్రీహరికోట వద్ద ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తనుంది. ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు సుమారు 3. 84 లక్షల కిమీ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో జాబిల్లిపై చంద్రయాన్ 3 అడుగుపెట్టనుంది.
చంద్రుడిపై కాలుమోపే చారిత్రాత్మక సన్నివేశాన్ని వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహితం శ్రీహరికోటకు వచ్చే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. 2019లో జరిగిన చంద్రయాన్ మిషన్ ల్యాండింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రధాని మోదీ శ్రీహరికోటకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది.
చంద్రుడిపై ల్యాండ్ అయ్యే చివరి నిమిషంలో రోవర్ గతి తప్పింది. దాన్ని వేగాన్ని నియంత్రించే విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు సక్సెస్ కాలేకపోయారు. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మిషన్ విఫలం కావడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు మున్నీరయ్యారు. ఆయనను మోదీ అక్కున చేర్చుకుని ఓదార్చిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్ 3ని ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేశామని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 2 లో సమస్య ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే పెరామీటర్ వేరియేషన్ లేదా విభాగాలను వేరు చేసే వ్యవస్థను నిర్వహించే సామర్ధం చాలా పరిమితమే. అందుకే ఈసారి ఆ సామర్ధాన్ని మరింత పెంచామని వివరించింది.
“చంద్రయాన్ 2ను సక్సెస్ ఆధారిత మోడల్ లోరూపొందించగా, చంద్రయాన్ 3 లో మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్‌ను అమలు చేస్తున్నాం. ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు దాన్ని ఎలా రక్షించాలనే విధానమే ఇది” అని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం