ఉమ్మడి పౌరస్మృతికి 67.2 శాతం ముస్లిం మహిళల మద్దతు

దేశంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా సానుకూల, ప్రతికూల స్పందనలు వస్తున్నాయి. అయితే యూసీసీ అమలుపై కేంద్రం ప్రకటన చేయడంతో ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. కోడ్ పేరిట మైనారిటీ వర్గాల స్వేచ్ఛ, హక్కులను కాలరాయొద్దని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్రంగా వ్యతిరేకించింది.
ఈ క్రమంలో న్యూస్ 18 నెట్‌వర్క్ సర్వే నిర్వహించగా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి బయట పడింది. 67.2 శాతం మంది ముస్లిం మహిళలు యూసీసీలోని అంశాలకు సానుకూలంగా స్పందించడం విశేషం.  ప్రతి భారతీయుడికి ఒకే రకమైన చట్టం అమలులో ఉండాలని 67.2 శాతం మంది ముస్లిం మహిళలు ముక్తకంఠంతో చెప్పారు.
వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం విషయాల్లో వర్గ భేదాలు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో న్యూస్ 18 నెట్‌వర్క్ అతిపెద్ద యూసీసీ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 884 మంది రిపోర్టర్లు 8,035 మంది ముస్లిం మహిళలను ఇంటర్వ్యూ చేశారు. వీరికి యూసీసీ గురించి చెప్పకుండా వ్యక్తిగత విషయాలైన వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాల గురించి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో నిరక్షరాస్యులతో పాటు పీజీ పూర్తి చేసిన మహిళలు ఉన్నారు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఇందులో పాల్గొన్నారు. భారతీయులు అందరికీ ఒకే రకమైన చట్టం అమలులో ఉండాలా? అని ప్రశ్నించగా 8,035 మందిలో 5,403 మంది ముస్లిం మహిళలు, అంటే 67.2% మంది ‘అవును’ అని చెప్పారు. 2,039 (25.4 శాతం) మంది మహిళలు ఉండకూడదని చెప్పారు. 593(7.4 శాతం) మంది తమకేమీ తెలియదని, ఏమీ చెప్పలేమని తెలిపారు. 

అయితే, ‘అవును’ చెప్పిన వారిలో అధికంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు ఉన్నారు. 5,403 మందిలో 68.4 శాతం అంటే 2,076 మంది ఒకే చట్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. 27 శాతం(820) మంది ఉండొద్దని అన్నారు. వీరిలో 4.6 శాతం(137) మంది ఏమీ తెలియదని, ఏమీ చెప్పలేమని కామెంట్ చేశారు.

కాగా, సర్వేలో పాల్గొన్న వారిలో 74% (5,918) మంది ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న జంటలు ఎలాంటి ఆంక్షలు లేకుండా మళ్లీ పెళ్లి చేసుకునేందుకు తమ మద్దతు తెలిపారు. అయితే 18% (1,450) మంది ఈ ఆలోచనను వ్యతిరేకించారు. కచ్చితంగా తెలియదని లేదా స్పందించని వారు 8% (667) మంది ఉన్నారు. 

ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ లేదా ఉన్నత విద్యను పూర్తి చేసిన వారిలో 79% (2,395) మంది అపరిమిత పునర్వివాహ హక్కులను కోరుకున్నారు. 18-44 ఏళ్ల ఏజ్ గ్రూప్‌లో 75% (4,725) మంది ఈ ఆలోచనకు మద్దతు తెలపగా, 44 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో 69% (1,193) మంది అనుకూలంగా ఉన్నారు.

ఇలా ఉండగా, కనీసం 76% ముస్లిం మహిళలు సమాజంలోని పురుషులు నలుగురు భార్యలను తీసుకునే హక్కును కలిగి ఉండకూడదని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ముస్లిం పురుషులకు నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే హక్కు ఉందా అని అడిగినప్పుడు, 76% మహిళలు అంటే 6,146 మంది ‘లేదు’ అని, 1,400 మంది అంటే 17% మంది ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. 

అయితే వీరిలో 489 (6%) మంది ‘తెలియదు లేదా కుదరదు’ అని అన్నారు. 18-44 వయస్సు ఉన్న కేటగిరీలో, 78% (4,907) మంది మహిళలు ‘నో’ అని, 17% (1,055) మంది ‘అవును’ అని పేర్కొన్నారు . 5% (333) మంది ‘తెలియదు లేదా చెప్పలేము’ అని తెలిపారు.

 44+ వయస్సు గలవారి విషయంలో, 71% (1,239) మంది ‘లేదు’ అని, 20% (345) మంది అవును అని, 9% (156) మంది ‘తెలియదు లేదా చెప్పలేను’ అని చెప్పారు. గ్రాడ్యుయేట్ల+ విషయంలో, 79% (2,385) మంది ‘లేదు’ అని, 16% (490) మంది ‘అవును’ అని చెప్పారు . 5% (158) మంది ‘తెలియదు లేదా చెప్పలేము’ అని తెలిపారు.

దేశంలో పురుషులు, మహిళల వివాహానికి చట్టబద్ధమైన వయసు 21 సంవత్సరాలు ఉండాలని 78.7% ముస్లిం మహిళలు కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. పురుషులు, స్త్రీలందరికీ వివాహానికి చట్టబద్ధమైన వయసుగా 21 ఏళ్లను సమర్ధిస్తారా అని అడిగినప్పుడు.. 78.7% (6,320) మహిళలు అవును అని చెప్పారు. 

16.6% (1,337) మంది కాదు అని, 4.7% (378) మంది తెలియదు లేదా చెప్పలేమని తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం డిగ్రీ చదివిన వారు 82.4% (2,500) ఈ ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు. అయితే 14.3% (433) మంది ‘నో’ అన్నారు. 3.3% (100) మంది ‘తెలియదు లేదా చెప్పలేను’ అని చెప్పారు.