శివసేన వర్గాలకు అనర్హత వేటుపై స్పీకర్ నోటీసులు

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్ నర్వేకర్‌ చీలిపోయిన శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాలకు చెందిన 54 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ‘మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్‌ ప్రశ్నించారు. తాను జారీచేసిన నోటీసులకు వివరణ ఇవ్వాలని రెండు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించారు.
ఎమ్మెల్యేలు ప్రతిస్పందించడానికి ఏడు రోజుల గడువు ఇచ్చారు. అనర్హతపై చర్య తీసుకోకుండా ఉండటానికి అవసరమైన అన్ని ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) నుంచి శివసేన రాజ్యాంగం కాపీ తనకు అందిందని నార్వేకర్ చెప్పడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో శివసేనను చీల్చి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్‌ థాకరే వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు ఇచ్చారు. 

అయితే, షిండే వర్గంలోని 40 మందిలో 16 మంది అనర్హతపై విచారణ ప్రారంభించినున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పీకర్‌కు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నర్వేకర్‌ వెంటనే శివసేన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అసలైన శివసేన తమదంటే తమదేనని రెండు వర్గాల ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.

ఏకనాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరించేలా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేనకు చెందిన ఎమ్మెల్యే సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏకనాథ్ షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని నిర్ణయించాలని మే 11న సుప్రీంకోర్టు స్పీకర్‌ను కోరింది.