బెంగాల్ ఎన్నికల్లో 18 మంది మృతి … రాష్ట్రపతి పాలన కోరిన బీజేపీ

పశ్చిమ్ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ రక్తసిక్తంగా మారింది. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో 18 మంది మృతి చెందారు. ఈసారి ఎటువంటి హింసకు తావులేకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించి ఎన్నికలను నిర్వహించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను వినియోగించినా హింసను నివారించలేకపోయాయి. బాంబు పేలుళ్లు, తుపాకుల మోత, కత్తిపోట్లు వంటి భయానక ఘటనలతో శనివారం బెంగాల్ దద్దరిల్లింది. బ్యాలెట్‌ బాక్సులను ఎత్తుకెళ్లడం, అది వీలుకాని చోట వాటికి నిప్పుపెట్టడం, నీళ్లు పోయడం వంటి దుశ్చర్యలకు దుండగులు పాల్పడ్డారు.

అయితే హింసను అరికట్టడంలో విఫలమైనందుకు బీజేపీతో సహా ప్రతి రాజకీయ పార్టీ బలగాలను నిందిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ కేంద్ర బలగాల కో-ఆర్డినెటర్‌కు బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కోర్టు ధిక్కార నోటీసును అందజేశారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో హింసపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివసిస్తున్న కాళీఘాట్‌కు నిరసన ర్యాలీ చేపడతామని కూడా ఆయన హెచ్చరించారు. ‘తృణమూల్ పాలనలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు ఎండమావిగా మారాయి. రాజ్యాంగంలోని 355 అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధించినప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది’ అని సువేందు స్పష్టం చేశారు. 

అయితే హింస వెనుక తమ పార్టీ ఉందన్న ఆరోపణలను అధికార తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొట్టింది. ‘అదే నిజమైతే మా పార్టీ కార్యకర్తలపై ఎందుకు దాడులు జరుగుతాయి? హత్యకు గురవుతారు? ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఓటమిని అంగీకరించేశాయి. ఇప్పుడు హింస ఎన్నికలను ఎలా ప్రభావితం చేశాయో చెప్పడానికి కథలు అల్లుతున్నాయి’ అని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండగా కేవలం 60 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే హింస చోటు చేసుకోవడం, పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగడం జరిగిందని కూడా ఆ పార్టీ పేర్కొంది.

 కాగా, రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి హింసలో గాయపడిన వారిని కలిసి మాట్లాడారు. ఇవి చెదురుమదురు ఘటనలే అయినప్పటికీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరగడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు బ్యాలెట్‌తో జరగాలి తప్ప బులెట్లతో కాదని ఆయన హితవు చెప్పారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం 63,000 మంది కేంద్ర రిజర్వు పోలీసులను, దాదాపు 70,000 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన జూన్‌ 8 నుంచి శనివారం వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 35 మంది చనిపోయారు. మెజారిటీ బూత్‌లలో కేంద్ర బలగాలు లేకపోవడం, అస్తవ్యస్తమైన మోహరింపు శనివారం నాటి హింసకు ప్రధాన కారణం. బలగాలను సక్రమంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మోహరించకపోవడమే సమస్యలకు దారితీసిందని కేంద్రం దళాల సీనియర్ అధికారులు ఆరోపించారు.