వందే భారత్ తో సహా పలు రైళ్లలో 25 శాతం దాకా తగ్గింపు

వందే భారత్‌ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే బోర్డు భారీ ఉపశమనం కలుగనున్నది. వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్‌ర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలను 25శాతం వరకు తగ్గించనున్నట్లు బోర్డు పేర్కొంది.  గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు జోన్లకు సూచించింది.

ప్రాథమిక ఛార్జీపై గరిష్ఠంగా 25 శాతం వరకు తగ్గింపు ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇతర ఛార్జీలు విధింపు ఉంటుందని పేర్కొంది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీల తగ్గింపు నేపథ్యంలో వాపస్‌ ఇవ్వబడదని స్పష్టం చేసింది. అలాగే, సెలవులు, పండుగ సమయంలో ప్రత్యేక రైళ్లలో ఈ పథకం వర్తించదని చెప్పింది. 

ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టడానికి జోనల్ రైల్వేలకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. విస్టాడోమ్‌ కోచ్‌లతో సహా ఏసీ సౌకర్యం ఉన్న అన్ని రైళ్లలోని ఏసీ చైర్‌కాన్‌, ఎగ్జిక్యూటివ్‌ తరగతులకు ఈ పథకం వర్తించనున్నది. 

రాయితీ ప్రైమరీ ఛార్జీపై గరిష్ఠంగా 25 శాతం వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీ, సూపర్‌ఫాస్ట్‌ సర్‌ఛార్జీ, జీఎస్టీ తదితర ఛార్జీలు అదనంగా ఉంటాయి. తత్కాల్‌ కోటాపై రాయితీ ఉండదని, ఫస్ట్‌ చార్ట్‌ ప్రకటించే వరకు, కరెంట్‌ బుకింగ్‌ సమయంలో బుక్‌ చేసుకున్న టికెట్లకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ఆన్‌బోర్డ్‌లో టీటీఈ ద్వారా జారీ చేసే టికెట్‌పై సైతం డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది.

కొత్త రంగులో వందేభారత్ 

ఇట్లా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కొత్తరంగులో రాబోతుంది. మొన్నటివరకు ప్రారంభించిన వందేభారత్ రైళ్లు బ్లూ-గ్రే కాంబినేషన్‌లో ఉండగా తాజాగా ఆరెంజ్-గ్రే కాంబినేషన్‌లో కొత్త రైళ్లు రాబోతున్నాయి. 

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)ని సందర్శించి కొత్తరంగులతో కూడిన ట్రైన్ ఫొటోలను రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. వందేభారత్‌ రైలు బయటి భాగం ఎక్కువగా తెలుపు రంగులో ఉండటం వల్ల మట్టి అంటుకుని మురికిగా కనిపించే అవకాశముందని, అందువల్ల కాషాయ రంగుకు మార్చాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 

కాగా, చెన్నైలోని ఐసీఎఫ్ లో ఇప్పటి వరకూ 25 రకాల డిజైన్లలో 70 వేల బోగీలు తయారయ్యాయి. వందే భారత్‌ రైలు బోగీలు కూడా ఐసిఎఫ్ లోనే తయారవుతున్నాయి. ఇక్కడ తయారైన 25 వందే భారత్‌ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తున్నాయి. 2023-24లో ఈ కర్మాగారంలో 736 వందే భారత్‌ రైలు బోగీలు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాగా, త్వరలోనే దేశవ్యాప్తంగా సంప్రదాయక పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ ‘టి ట్రైన్‌’లను ప్రవేశపెట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రాచీన ‘స్టీమ్‌ ఇంజన్‌’ తరహాలో రూపొందించిన విద్యుత్‌ రైలింజన్‌తో కూడిన ‘టి ట్రైన్‌’ను మంత్రి శనివారం చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ హెరిటేజ్‌ స్పెషల్‌ రైలును మూడు నెలల్లోనే దేశంలో నడపనున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల్లో స్టీమ్‌ ఇంజన్‌ పట్ల ఉన్న ఆకర్షణ, అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని అదే తరహాలో విద్యుత్‌ ఇంజన్‌ను రూపొందించామని తెలిపారు.