ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య 500 రోజులు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టి శనివారంతో 500రోజులు పూర్తయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి 24న ‘ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరిట రష్యా దాడులు మొదలుపెట్టినా ఇప్పటికీ యుద్ధం ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనబడడం లేదు.  మరో వైపు రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ లో ఆస్తి, ప్రాణ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో రష్యా దూకుడు కనబరిచినా ఆ తర్వాత ఉక్రెయిన్ పశ్చిమ దేశాల సాయంతో ఎదురు దాడులకు దిగుతోంది. తమ భూభాగాలను రక్షించుకోవడానికి గట్టిగా పోరాడుతూనే ఉంది. 

ఇన్ని రోజులగా రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైనికుల ధైర్య సాహసాలను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రశంసించారు. రష్యా ఆక్రమణనుంచి ఉక్రెయిన్ సేనలు విముక్తం చేసిన నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్‌నుంచి జెలెన్‌స్కీ ప్రసంగిస్తూ దీవి విముక్తి కోసం పోరాడిన సైనికులను, ఉక్రెయిన్‌లోని మిగతా బలగాలను పొగడ్తలతో ముంచెత్తారు. 

ఉక్రెయిన్ తన భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తిరిగి దక్కించుకుంటుందనడానికి ఈ దీవిపై పట్టును తిరిగి దక్కించుకోవడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.‘ ఈ 500 రోజులుగా పోరాటం జరుపుతున్న ప్రతి సైనికుడికి విజయానికి సంకేతమైన ఈ ప్రదేశం నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన తెలిపారు. 

ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తొలి రోజయిన గత ఏడాది ఫిబ్రవరి 24నే రష్యా నల్ల సముద్రంలోని చిన్న దీవి అయిన స్నేక్ ఐలాండ్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఉక్రెయిన్‌లోని అతి పెద్ద రేవు, ఆ దేశ నౌకాదళ ప్రధాన కేంద్రమైన ఒడేసాపై దాడులు చేయడానికి ఈ దీవిని ఉపయోగించుకోవచ్చన్న అంచనాలతో దీన్ని స్వాధీనం చేసుకుంది. అయితే ఆ తర్వాత ఉక్రెయిన్ ఈ దీవిలోని రష్యా సైనిక స్థావరంపై స్థాయిలో బాంబుల వర్షం కురిపించడంతో రష్యా జూన్ 30న ఆ దీవిని వదిలిపెట్టాల్సి వచ్చింది.

ఇలా ఉండగా, యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు తొమ్మిది వేల మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. మృతుల్లో 500 మంది చిన్నారులున్నట్లు  ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్ (హెచ్‌ఆర్‌ఎంఎంయు) తెలిపింది.  వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపింది. యుద్ధంలో పౌర మరణాలను తీవ్రంగా ఖండించింది. 2022తో పోలిస్తే ఈ ఏడాది మృతుల సంఖ్య సగటు తక్కువగానే ఉన్నప్పటికీ మే, జూన్ నెలల్లో మళ్లీ పెరగడం ప్రారంభమైందని పేర్కొంది.

ఈ యుద్ధంలో ఇరు వైపులా వేలది మంది సౌనికులు చనిపోయారు. మృతుల సంఖ్యపై అటు రష్యా కానీ, ఇటు ఉక్రెయిన్ కానీ నిర్దిష్ట ప్రకటన చేయలేదు. అయితే జూలై 7 నాటికి 2.32 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.  మరో వైపు 63 లక్షల మంది ఉక్రెయిన్లు శరణార్థులుగా మారారని ఐరాస అంచనా వేసింది. 60 లక్షల మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 17 శాతం రష్యా ఆక్రమణలో ఉన్నట్లు అంచనా.