ఉత్త‌రాదిని వ‌ణికిస్తున్న వ‌ర్షాలు.. కశ్మీర్‌లో ఇద్దరు సైనికుల మృతి

ఉత్త‌రాదిని భారీ వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. గ‌త మూడు రోజులుగా ప‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్ధ‌మైంది. ఉత్తర భారత దేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజ‌ధానిలో 41 ఏండ్ల గ‌రిష్ట‌స్ధాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153ఎంఎం వ‌ర్ష‌పాతం న‌మోద‌వ‌డంతో 1982 త‌ర్వాత ఈ స్ధాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం ఇదే తొలిసారని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) పేర్కొంది 
కుండ‌పోత‌తో దేశ రాజ‌ధానిలోని పార్కులు, అండ‌ర్‌పాస్‌లు, మార్కెట్లు, హాస్పిట‌ల్ ప్రాంగ‌ణాలు, మాల్స్ స‌హా వాణిజ్య సంస్ధ‌ల ప్రాంగ‌ణాలు నీట‌మునిగాయి. భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ వీధుల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప్ర‌యాణీకులు, పాద‌చారులు మోకాలి లోతు నీళ్ల‌లో గ‌మ్య‌స్ధానాల‌కు చేరుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. గురుగ్రాం సైతం భారీ వ‌ర్షాల‌తో వ‌ణికింది. రోడ్ల‌న్నీ జల‌మ‌యం కావ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.  జమ్మూ కశ్మీర్‌లో మెరుపు వరదలు సంభవించి, ఇద్దరు సైనికులు మృతిచెందారు. పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ వద్ద డోగ్రా కాల్వను దాటుతుండగా ప్రవాహ ఉద్ధృతికి 16 కార్ప్స్‌కు చెందిన ఇద్దరు సైనికులు గల్లంతైనట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. గల్లైంతన ఇద్దరు సైనికుల మృతి చెందారని తెలిపింది.
 
‘జమ్మూ రీజియన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కథువా, సాంబ జిల్లాలకు వరద ముప్పు ఉంది.. మెరుపు వరదలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయి.. వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లోకి వ్యక్తులందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ అధికార ప్రతినిధి సూచించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
భారీ వర్షాలకు వరదలు సంభవించి, రాజస్థాన్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఎడ‌తెగ‌ని వ‌ర్షాల‌తో గ‌డిచిన 24 గంట‌ల్లో ఐదుగురు మ‌ర‌ణించారు.  సిమ్లాలో ముగ్గురు, చంబా, కులు ప్రాంతాల్లో ఒక్క‌రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. బీస్ న‌ది ప్ర‌మాద‌స్ధాయిని మించి ప్ర‌వ‌హిస్తుండ‌గా వ‌ర‌ద పోటెత్తిన కాంగ్ర‌, మండి, సిమ్లా త‌దితర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతోపాటు మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ముప్పు ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా బండ రాళ్లు పడి ఓ వాహనం నదిలోకి దూసుకెళ్లింది. బండరాయిను తప్పించబోయి అదుపుతప్పింది.
ఇందులోని 11 మందిలో ఐదుగుర్ని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఆరుగురు గల్లంతవగా వీరి కోసం గాలిస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన భార్య ఈ ప్రమాదం నుంచి బయటపడగా, అతడి ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ ముమ్మరంగా గాలిస్తున్నారు. హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మ‌డి రాజ‌ధాని చండీఘ‌ఢ్‌లో శ‌నివారం రోజంతా కుండ‌పోతతో న‌గ‌రం త‌డిసిముద్ద‌యింది.