ఆరోగ్యంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలి

మానవుల ఆరోగ్యంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) హెచ్చరించింది.  హంగేరి రాజధాని  బుడాపెస్ట్‌లో ”పర్యావరణం మరియు ఆరోగ్యం” పై 7వ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో డబ్ల్యుహెచ్‌ఒ యూరోప్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ డా. హెన్స్‌ క్లూగే మాట్లాడుతూ పర్యావరణ మార్పులు, కాలుష్యం, క్షీణిస్తున్న జీవవైవిధ్యంతో మానవుల ఆరోగ్యానికి మూడింతల ముప్పు పొంచి వుందని అన్నారు. వీటిని అడ్డుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సి వుందని హెచ్చరించారు. 

క్లూగే నివేదిక ప్రకారం యూరోపియన్‌ ప్రాంతంలో పర్యావరణ ప్రమాద కారకాలతో ఏడాదికి 14 లక్షల మంది (1.4 మిలియన్లు) మరణిస్తున్నారని అంచనా వేయగా, వీరిలో సుమారు సగం మంది వాయు కాలుష్యం కారణంగానే మరణించారు. గత వేసవికాలం యూరోప్‌ చరిత్రలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, అత్యధిక వేడి కారణంగా 20,000 మందికి పైగా మరణించారని తెలిపారు. 

”ప్రస్తుతం మనం చేపడుతున్న చర్యలు నెమ్మదించడంతో, 2030 నాటి మన సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి” అని స్పష్టం చేశారు. యూరోపియన్‌ ప్రాంతంలో ఇప్పటికీ 77 మిలియన్ల (ఏడు కోట్ల డెబ్భై లక్షలు) మందికి సురక్షితమైన తాగునీరు కూడా పొందడం లేదని చెప్పారు. ”ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. భాగస్వామ్య దేశాలు చర్యలు తీసుకోవాలి. వ్యక్తులుగా మనమందరం చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న కాప్‌ 28 సమావేశాల్లో పర్యావరణంపై చర్యలు తీసుకునేందుకు యూరోపియన్‌ దేశాలు ఉమ్మడి నిబద్ధతను ప్రకటిస్తాయని పేర్కొన్నారు.