మొదటి సారి దేశం వెలుపల టాంజానియాలో ఐఐటీ

ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న భారతీయ విద్యా సంస్థల్లో మొదటి స్థానంలో నిలిచేవి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ). భారత్ లోని ఈ సాంకేతిక విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు.

భారత్ లో పలు ఐఐటీలను నెలకొల్పిన ప్రభుత్వం తాజాగా విదేశాల్లో తొలి క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. టాంజానియాలోని జంజిబార్ లో ఐఐటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాతో ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. 

ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటీ మద్రాసుకు చెందిన మరో క్యాంపస్ ను జాంజిబార్ లో ఏర్పాటు చేస్తారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జాంజిబార్ ప్రెసిడెంట్ హుస్సేన్ అలీ విన్యీల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జైశంకర్ టాంజానియా పర్యటనలో ఉన్నారు. 

భారత్, టాంజానియాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను జాంజిబార్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న లక్ష్యాల మేరకు టాంజానియాలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

లోని ప్రముఖ యూనివర్సిటీల క్యాంపస్ లను విదేశాల్లో ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించాలని నూతన జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా పేర్కొన్నారు. టాంజానియా ఐఐటీలో అకడమిక్ ప్రొగ్రామ్స్ 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి.