ఆఫ్ఘన్ లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం

అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు  ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 2021 ఆగ‌స్టులో ఆఫ్ఘాన్‌ ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  మరీ ముఖ్యంగా మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహిళల ఉన్నత చదువులపై ఆంక్షలు పెట్టారు. ఈద్‌ వేడుకల్లోనూ పాల్గొనకుండా నిషేధం విధించారు. 
తాజాగా ఆ దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా బ్యూటీ సెలూన్ లపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. దేశంలో మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటున్నదని చెప్పిన కొద్దిరోజులకే ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. తాజాగా బ్యూటీ సెలూన్ల నిషేధానికి ఎటువంటి కారణం చెప్పకపోయినప్పటికీ దేశం మొత్తం మీద నెల రోజుల లోపుగా మూసివేయాలని జూన్ 24న ఆదేశాలు జారీచేశారు.
‘కాబూల్ సహా దేశంలోని ఇతర ప్రావిన్సుల్లో మహిళలు నిర్వహించే అన్ని బ్యూటీ సెలూన్ లను నిషేధిస్తున్నాం. ఈ ఆదేశాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందే.  సెలూన్లు తమ కార్యకలాపాలను నిలిపివేసేందుకు జులై 2 నుంచి నెల గడువు ఇస్తున్నాం. అనంతరం తమ మూసివేత గురించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇప్పటికే మహిళలను విద్య, ఉద్యోగాలు, బహిరంగ ప్రదేశాలలో తిరగడం వంటి కదలికలపై తాలిబన్లు ఆంక్షలు విధించారు. కనీసం మగతోడు లేకుండా ప్రయాణాలు కూడా చేయరాదని నిషేధించారు.