ప్రతిపక్ష కూటమికి బెంగాల్ లో చుక్కెదురు

బిజెపికి వ్యతిరేకంగా దేశం అంతటా ఒకే అభ్యర్థిని నిలబెట్టే విధంగా ప్రతిపక్షాలు సీట్లు సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించిన ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటీలో కీలక భూమిక వహించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత రాష్ట్రంలో మాత్రం అటువంటిది ఏమీ లేదని సంకేతం ఇచ్చారు.
పశ్చిమబెంగాల్‌లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని, విపక్షాల ఐక్యతా కూటమి అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెగేసి చెప్పింది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికు వ్యతిరేకంగా విపక్షాల జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష దిగ్గజనేతలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీఎంసీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌కు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాల ఐక్య కూటమి అవసరం లేకుండానే ఒంటరిగా పోటీ చేసే సత్తా తమ పార్టీకి అందని తెలిపారు.  అయితే,  బీజేపీపై పోరుకు ఐక్యకూటమి అవసరాన్ని పాట్నా భేటీలో మమతా బెనర్జీ బలంగా వినిపించారు.  విపక్ష పార్టీలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని సమావేశానంతరం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.