ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్​సీపీ అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్​ పవార్​కు గట్టి షాక్ తగిలింది​. శరద్​ పవార్​పై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బంధువు, ఎన్​సీపీ సీనియర్​ నేత అజిత్​ పవార్​ ఆదివారం బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తోపాటు ఎన్‌సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.
 
ఆదివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. వీరిలో ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ కూడా ఉన్నారు. అజిత్ పవార్ నాలుగేళ్లలో మూడోసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
 
ఇంతకాలంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత​గా ఉన్న అజిత్​ పవార్ రాజ్​ భవన్​లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ ల సమక్షంలో​ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీకి 53 మంది ఎమ్యెల్యేలు ఉండగా వారిలో 40 మంది అజిత్ పవర్ కు మద్దతు ఇస్తున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి.
 
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేరికను స్వాగతిస్తున్నామని సిఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. అజిత్ చేరికతో మహారాష్ట్ర మరింత బలోపేతం అవుతుందని షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం డబుల్ ఇంజిన్ ఉన్న సర్కార్ అజిత్ చేరికతో త్రిబుల్ ఇంజిన్ సర్కార్‌గా మారిందని షిండే చెప్పారు. ఎన్​సీపీపై అజిత్​ పవార్​ అసంతృప్తితో ఉన్నట్లు, ఆయన బీజేపీలో చేరనున్నట్టు 2,3 నెలలుగా ఊహాగానాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. బీజేపీలో చేరడంపై అజిత్​ పవార్​ ఎప్పుడు మాట్లాడలేదు కానీ.. ఎన్​సీపీపై అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఎన్​సీపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించారు అజిత్​ పవార్​. ఎన్​సీపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, శరద్​ పవార్​ కుమార్తె సుప్రియా సూలే, సీనియర్​ నేత ఛగన్​ భుజ్​బాల్​లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశం జరిగిన కొంతసేపటికే రాజ్​ భవన్​లో ఏర్పాట్లు మొదలయ్యాయి. అజిత్​ పవార్ నివాసం​ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు రావడం, రాజ్​ భవన్​కు చేరుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అజిత్​ పవార్​ ఆదివారం ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి. మరోవైపు రాజ్​ భవన్​కు అధికారపక్షంలోని నేతలు సైతం క్యూ కట్టారు. మధ్యాహ్నం నాటికి.. అజిత్​ పవార్​, సీఎం ఏక్​నాథ్​ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​లు రాజ్​ భవన్​కు చేరుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పార్టీ పెద్దల సమక్షంలో అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారం చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో అధికార బీజేపీకి మెజారిటీ రాలేదు. విభేదాలతో బంధాన్ని తెంచుకుంది శివసేన. చాలా రోజులు గడిచినా ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ తరుణంలో యావత్​ దేశానికి షాక్​ ఇచ్చారు అజిత్​ పవార్​! దేవేంద్ర ఫడణవీస్​తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ ఆయన చర్యలు ఎక్కువ రోజులు ఫలితాల్నివ్వలేదు. మెజారిటీ లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం రెండు రోజులకే కూలింది. ఎన్​సీపీ, కాంగ్రెస్​తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.