జమ్మూలో గెరిల్లా దాడులకు పాక్ ఎత్తుగడలు

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేని పరిస్థితుల్లో దివాళా పరిస్థితుల వైపు పయనిస్తున్న పాకిస్థాన్ సొంతింటిని చక్కదిద్దుకోవడంపై కన్నా భారత్ లో అల్లకల్లోలాలు స్రుసీతఁచడం పట్లనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది.
తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపుతూ జమ్మూలోని భద్రతా దళాలు, శిబిరాలు, గస్తీ బృందాలపై గెరిల్లా దాడులు చేయించేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ వ్యూహంలో జమ్మూ, రాజౌరీ, పూంఛ్, రియాసీ జిల్లాలను లక్ష్యంగా చేసుకుంటోంది.
కౌంటర్ టెర్రరిజం అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, భారత్ లో కల్లోలం సృష్టించడం కోసం పాకిస్థాన్ మరిన్ని దారుణాలకు తెగబడుతోంది. కశ్మీరు లోయలోని హిందూ మైనారిటీలపై ఇప్పటి వరకు దాడులు చేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించిన పాకిస్థాన్ దృష్టి ఇప్పుడు దృష్టి జమ్మూ, రాజౌరీ, పూంఛ్, రియాసీ జిల్లాలపై పడింది.

ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని మరింత పెంచాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ దుష్టపన్నాగాలకు దీటుగా స్పందించేందుకు భారతీయ భద్రతా దళాలు సమాయత్తమవుతున్నాయి. మే 5న రాజౌరీలో 9 పారా ఎస్ఎఫ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. పూంఛ్ జిల్లాలో సైనిక వాహనంపై ఏప్రిల్ 20న జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.

సుశిక్షితులైన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడ్డారు. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు, స్టిక్కీ బాంబులు ఉన్నాయి. గట్టి ప్రణాళికతో ఈ దాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా ఉగ్రవాదులు గెరిల్లా యుద్ధ తంత్రాలను అనుసరిస్తున్నారు. ఓ లక్ష్యంపై దాడి చేసి, తిరిగి పీర్ పంజల్ ప్రాంతంలోని అడవుల్లోకి పారిపోయి, మళ్లీ మరొక దాడికి సమాయత్తమవుతున్నారు.

మొదటి దాడిలోనే భద్రతా దళాలను టార్గెట్ చేయడానికి బదులుగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కనీసం 40 మంది అత్యంత కఠోర శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా. సరిహద్దుల్లో నియమితులయ్యే సైనికులను కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాకిస్థాన్ సైన్యం వాడుకుంటోందని కూడా భారత భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.

పాకిస్తాన్ సుశిక్షితులైన ఉగ్రవాదులను నియంత్రణ రేఖ వెంబడి భారత దేశంలోకి పంపిస్తుంది. ఈ ఉగ్రవాదులు అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్నారు. వీరి కమాండర్లు జమ్మూ ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒకరిద్దరు సీనియర్ కమాండర్లు నేపాల్, లేదా, బంగ్లాదేశ్ గుండా జమ్మూలోకి ప్రవేశించి ఉంటారని భారత భద్రతా దళాలు భావిస్తున్నాయి.

జమ్మూ, రాజౌరీ, పూంఛ్ ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రిజర్వు పోలీస్ దళం (సిఆర్పిఎఫ్), జమ్మూ-కశ్మీరు పోలీసులు 948 గ్రామాల్లోని విలేజ్ డిఫెన్స్ గార్డులకు ఆయుధాల వాడకంలో, సరిహద్దుల్లో నిఘా పెట్టడంలో శిక్షణ ఇచ్చారు.