ఎన్సీపీ అంతా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే

నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అంతా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉందని ఆదివారం ఉపముఖ్యమంత్త్రిగా పదవీ ప్రమాణం చేసిన అజిత్‌ పవార్‌ వెల్లడించారు. మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ మొత్తం బీజేపీ, శివసేన ప్రభుత్వంతో ఉండాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అందుకే ఎన్సీపీ అంతా ప్రభుత్వంలో చేరిందని పేర్కొన్నారు.
 
ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని చెబుతూ కొంత మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని, మరికొంత మంది ముంబైకి చేరలేకపోయారని చెప్పారు. వారంతా తనకు మద్దుతు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వంలో చేరడంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారని, ఎన్‌సీపీ పేరుతోనే తాను ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సీపీ పార్టీగానే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించామని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తుతోనే తామంతా పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు.

కాగా, చాలా మంది మమ్మల్ని విమర్శించేందుకు ప్రయత్నిస్తారని అజిత్‌ పవార్‌ తెలిపారు. అయితే వాటికి తాము స్పందించబోమని స్పష్టం చేశారు. మూడున్నరేళ్ల కిందట ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. శివసేనతో కలిసి వెళ్లిన తాము బీజేపీతో కలిసి వెళ్లలేమా? అని ప్రశ్నించారు.

నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అదే మాదిరిగా మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసినట్లు చెప్పారు. క్యాబినెట్‌ ప్రొఫైల్స్ ఖరారు కాగానే మహారాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు.

మరోవైపు, మహారాష్ట్ర ప్రజల అభీష్టం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరుల మద్దతు, వారి విశ్వాస బలంతో తాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్లు పేర్కొంటూ అజిత్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు. ప్రజల సంక్షేమం కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం తన పదవిని వినియోగిస్తానని అందులో పేర్కొన్నారు. పదవుల కోసం తాము ప్రభుత్వంలో చేరామని విమర్శించడంలో అర్థం లేదని పేర్కొంటూ జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కాగా, అజిత్‌ పవార్‌ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని చెప్పారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన కొంత మంది ఎన్సీపీ సహచరులను అవినీతి ఆరోపణల నుంచి ప్రధాని మోదీ తప్పించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు.

మరోవైపు ఎన్సీపీపై హక్కు తమకే ఉందని ఎవరైనా క్లెయిమ్ చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని శరద్‌ పవార్‌ తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు కోరుతామని చెప్పారు. ప్రజలు తమకు మద్దతిస్తారన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు.