ఉమ్మడి పౌరస్మృతికి బీఎస్సీ వ్యతిరేకం కాదు

ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకంకాదని బీఎస్సీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. అయితే ఈ పేరుతో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తాము సమర్థించబోమని పేర్కొన్నారు. పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగం పేర్కొన్నప్పటికీ దాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దకూడదని ఆమె సూచించారు.

ప్రజల్లో అవగాహన కల్పించి, ఏకాభిప్రాయం సాధించడంద్వారానే దాన్ని అమలు చేయాలని ఆమె తెలిపారు. ‘అన్ని మతాల ప్రజల కోసం ఒకే చట్టాన్ని తీసుకురావడం దేశాన్ని బలోపేతం చేయడంతోపాటు సామరస్యాన్ని, సోదరభావాన్ని కలిగిస్తుంది. దీనికోసం ప్రజల్లో అవగాహన కల్పించి, ఏకాభిప్రాయం తీసుకురావడం ఉత్తమ విధానం’ అని ఆమె పేర్కొన్నారు.

సర్వజనుల సంక్షేమం, సంతోషం కోసంకాకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ యూసీసీని తీసుకొస్తున్నట్టు కనిపిస్తోందని మాయావతి విమర్శించారు. బీజేపీ పక్షపాతం లేకుండా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఆమె చెప్పారు.

ఇలా ఉండగా, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీ మిత్ర పక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) ఉమ్మడి పౌర స్మృతికు మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది. ఎస్‌బీఎస్‌పీ చీఫ్, ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, అందుకు తాను మద్దతిస్తానని చెప్పారు. అందరికీ ఒకే చట్టం ఉండాలని చెప్పారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదానికి తాను మద్దతిస్తానని తెలిపారు.

కాగా, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)కి సమయం ఆసన్నమైందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. దీన్ని తీసుకురావడానికి బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు.  ఇతర పార్టీల్లోని అనేకమంది నేతలూ దేశాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

రాజ్యాంగాన్ని రూపొందించినవారు 70 ఏళ్ల క్రితమే యూసీసీ ఆవశ్యకతను నొక్కి చెప్పారని, సుప్రీంకోర్టు సైతం ఐదు వేర్వేరు కేసుల విచారణ సందర్భంగా దీని ఆవశ్యకతను ప్రస్తావించిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్క రూ సమైక్యంగా ఉండి, చట్టాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపిచ్చారు.

కాగా, యూసీసీపై చర్చలు ప్రారంభించడానికి బీజేపీ ఎంపీ సుశీల్‌ మోదీ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సోమవారం సమావేశంకానుంది. లీగల్‌ వ్యవహారాల విభాగం, శాసన విభాగం, భారత లా కమిషన్‌ ప్రతినిధులనూ సమావేశానికి ఆహ్వానించారు. 21వ లా కమిషన్‌ ఈ అంశంపై 2018లో ‘కుటుంబ చట్టం సంస్కరణ’ పేరిట రూపొందించినసంప్రదింపుల పత్రాన్ని స్టాండింగ్‌ కమిటీ తన సభ్యులకు అందజేసింది. అయితే, ఆ సంప్రదింపుల పత్రం ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని తీసుకురావడం సమర్థనీయంకాదని కూడా సంప్రదింపుల పత్రంలో స్పష్టం చేసింది.

తాజాగా, హిమాచల్ ప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ యూసీసీని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో మాట్లాడారు. బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వెంటనే స్పందించి విక్రమాదిత్యను ప్రశంసించారు. ఆయన తన అంతరాత్మ ప్రబోధాన్ని విన్నారని, దానినే ఆయన వెల్లడించారని కొనియాడారు. అంతకుముందు విక్రమాదిత్య మాట్లాడుతూ, యూసీసీని కాంగ్రెస్ సమర్థిస్తుందని తెలిపారు. ఐకమత్యం, సమగ్రతలను మరింత ప్రోత్సహించేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని పేర్కొన్నారు