ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం!

దేశంలోనే అత్యంత భద్రత నడుమ ఉంటె దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని భద్రతను నిర్ధారించే పనిలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు డ్రోన్‌ను చూసినట్టుగా పోలీసులకు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు డ్రోన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ డ్రోన్ కోసం ఢిల్లీ పోలీసుల అన్వేషణ మొదలైంది. ఇప్పటికైతే ఎలాంటి డ్రోన్ ఆచూకీ తెలియలేదు. ప్రధాని నివాసం ‘రెడ్ నో-ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్’ పరిధిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిలోనే ఉన్నారు.

ఈ జోన్‌లో డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అయినప్పటికీ డ్రోన్ కనిపించిందని ఎస్పీజీ అధికారులు చెప్పడం కలకలం రేపుతోంది. ప్రధాని నివాసం పైనున్న నో ఫ్లయింగ్ జోన్‌లో డ్రోన్‌ను ఎగురుతున్నట్లు సమాచారం అందిందని, ఎస్పీజీ అధికారులు ఉదయం 5:30 గంటలకు పోలీసులను సంప్రదించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇందుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద కదలికలు కనుగొనలేదని చెప్పారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ (ATC)ని కూడా సంప్రదించామని, వారికి కూడా డ్రోన్‌ ఎగిరినట్లు ఎలాంటి ఆనవాలు లభించలేదని వెల్లడించారు.  నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

ఢిల్లీలోని ‘రేస్ కోర్స్ రోడ్’లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఉంది. ఈ నివాసం ఐదు భవనాల సముదాయం. 9,7,5,3,1 నంబర్లతో ఆ భవనాలు ఉండటం గమనార్హం. ప్రధాని కార్యాలయ సముదాయం భద్రతా వలయంలో ఉంటుంది.  సామాన్య ప్రజానీకానికే కాదు మీడియాకు కూడా అనుమతి కష్టం. కొన్ని సందర్భాల్లో మాత్రమే విలేకరులను కాన్ఫరెన్స్ రూమ్స్ వరకూ అనుమతిస్తారు. అయితే.. ఫొటోలు తీయడం మాత్రం నిషేధం.