మహారాష్ట్ర పరిణామాలతో గందరగోళంలో ప్రతిపక్ష శిబిరం

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసేందుకు గత నెలలో పాట్నా వేదికగా ప్రారంభించిన ప్రయత్నాలపై మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం నీలినీడలు ప్రభావం కనిపిస్తుంది. ఎన్సీపీ ఎమ్యెల్యేలు అందరూ దాదాపుగా బిజెపి వైపు వెళ్లడంతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఊహించని ఎదురు దెబ్బకు గురయ్యాయి.
ఈ పరిణామాలు ప్రతిపక్ష శిబిరంలో గందరగోళంకు దారితీస్తున్నాయి. ఒక వంక ఈ నెల 13, 14 తేదీలలో బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో విడత సమావేశం వాయిదా పడిందని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తర్వాత ప్రతిపక్ష నేతల భేటీ నిర్వహించనున్నట్లు జేడీయూ ప్రకటించింది.  అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ నెల 17, 18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బీహార్, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున బెంగళూరులో జరగాల్సిన సమావేశం వాయిదాకు కారణమని జేడీయూ నేత కేసీ త్యాగి చెప్పారు. బీహార్‌ అసెంబ్లీ సమావేశాలకు తాను, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ అందుబాటులో ఉండాలి కాబట్టి విపక్షాల రెండో భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. అదే సమయంలో బీహార్ అసెంబ్లీ సమావేశాలు కూడా జులై 10 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా వేసినట్లు త్యాగి తెలిపారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. అయితే, ఈ సమావేశాలు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చినవి కావు. ముందుగానే తెలుసు. అయినా బెంగళూరు తేదీలు నిర్ణయించారు.  ఎన్సీపీలో జరిగిన పరిణామాలు ప్రధాన ప్రతిపక్షాలను కలవరంకు గురిచేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

మరోవంక, యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తో భేటీ కావడం ప్రతిపక్ష శిబిరంలో కలకలం రేపుతోంది. పాట్నా భేటీకి కేసీఆర్ ను ఆహ్వానించలేదు. కేసీఆర్ సహితం ఏ ప్రతిపక్ష కూటమిలో చేరే ప్రసక్తి లేదంటూ సంకేతం ఇచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సాయియంత్రమే ఖమ్మంలో ఓ బహిరంగసభలో మాట్లాడుతూ బిఆర్ఎస్ భాగస్వామిగా ఉండే ఏ కూటమిలో కాంగ్రెస్ ఉండబోదని ప్రకటించారు. పైగా, పాట్నా భేటీకి బిఆర్ఎస్ ను ఆహ్వానించాలనుకొంటే తాము అభ్యంతరం చెప్పమని, ఆ పార్టీని ఆహ్వానించి తాము హాజరు కాబోమని చెప్పామని కూడా వెల్లడించారు.
 
పాట్నా భేటీలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. పైగా, అక్కడ నేతలు చెప్పినట్లు ఉమ్మడిగా పోటీ చేయాలి అంటే ఉత్తర ప్రదేశ్ కీలకమైన రాష్ట్రం కానుంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రకమైన అవగాహనకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి అఖిలేష్ కేసీఆర్ ను కలవడం విస్మయం కలిగిస్తోంది. ప్రతిపక్ష కూటమితో సంబంధం లేకుండా తన దారి తాను చూసుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానం కలిగిస్తోంది.