వియత్నంకు బహుమతిగా యుద్ధనౌక పంపిన భారత్

రక్షణ రంగంలో పురోగమిస్తున్న భారత్ వియత్నాంకు యుద్దనౌకను బహుమతిగా ప్రకటించిన 10 రోజుల్లోనే దాన్ని అమలు చేసింది. స్వదేశీ-నిర్మిత కార్వెట్ ఐఎన్ఎస్ కిర్పాన్ అనే యుద్ద నౌకను బుధవారం భారతదేశ తూర్పు తీరంలోని విశాఖపట్నం నుండి వియత్నాంకు బయలుదేరినట్లు భారత నావికాదళం తెలిపింది.

కాగా, భారత్ మరోదేశానికి యుద్దనౌకను బహుమతిగా ఇవ్వడం ఇదే తొలిసారి. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్ గత నెలలో భారత్‌లో పర్యటించినప్పుడు ఈ బహుమతిని ప్రకటించింది.  భారత నౌకాదళం ఒక ప్రకటనలో కిర్పాన్ యుధ్ధ నౌక బదిలీ “సారూప్యత కలిగిన భాగస్వాములకు వారి సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయం చేయడానికి భారతదేశపు నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది”అని పేర్కొంది.

భారత్ గతంలో మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న పడవలు, సైనిక సామగ్రిని, మయన్మార్‌కు జలాంతర్గామిని అందించింది. దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా పొరుగు దేశమైన వియత్నాంకు యుద్ధనౌకను భారత్ అందించడం కీలకంగా మారింది. ఐఎన్ఎస్ కిర్పాన్, భారతదేశంలో నిర్మించబడింది. 1991లో భారత నౌకాదళంలోకి ప్రవేశించబడింది.

ఇది దేశీయంగా నిర్మించిన మూడవ ఖుక్రీ క్లాస్ క్షిపణి కార్వెట్. ఇప్పటికీ యాక్టివ్ సర్వీస్‌లో ఉన్న ఈ యుద్ధనౌకలో ఆయుధాలు, సెన్సార్ల శ్రేణిని అమర్చబడి ఉంటుంది. ఇది 1,350 టన్నుల బరువున్న ఓడ.  వియత్నాంకు దీన్ని బహుమతిగా ఇచ్చిన నేపథ్యంలో దీన స్థానంలో భారతదేశం కొత్త నౌకను రంగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. భారతదేశం మరియు వియత్నాం ఇటీవలి సంవత్సరాలలో తమ సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి. రక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి.

దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాలపై భారత్,వియత్నాం దేశాలు ఆగ్రహంగానే ఉన్నాయి. కొన్నాళ్లుగా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లో చైనా చేపడుతున్న సైనిక కార్యకలాపాలను వియత్నాం పదేపదే విమర్శిస్తోంది. చైనా దాని సార్వభౌమాధికార హక్కులు, అధికార పరిధిని ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

వియత్నాం మంత్రి గత నెల భారతదేశ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు 2009 నాటి తమ సుదీర్ఘ సహకారాన్ని,  2016లో సంతకం చేసిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉదహరించారు. 2030 వరకు విస్తరించే భారతదేశం – వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై జాయింట్ విజన్ స్టేట్‌మెంట్‌పై ఇరు దేశాలు సంతకం చేశాయి.