తెలుగు రాష్ట్రాల విముఖతతో అమలుకాని కేంద్ర ఉత్తరువు

తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకు రావాలన్న కేంద్ర ప్రభుత్వం సంకల్పం  తెలుగు రాష్త్ర ప్రభుత్వాల సహాయనిరాకరణ కారణంగా  ఆచరణయోగ్యమయ్యే అవకాశాలు కానరావటం లేదు. 2021 జులై 15న కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను అదే సంవత్సరం అక్టోబరు 15 నుంచి అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు అడుగు కూడా ముందుకు పడలేదు.
 
గెజిట్‌ అమలుకు బదులుగా తెలుగు రాష్ట్రాల జలవివాదా లు..ప్రత్యేకించి కృష్ణా జలాల పంపిణీలో తలెత్తే సమస్యలకు రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ- (ఆర్‌ఎంసీ)ల పరిధిలో పరిష్కరించి రూల్‌ కర్వ్స్‌ (నిర్వహణ, నియమావళి) అమలు చేయాలని కేంద్ర జలశక్తి భావిస్తోంది.  ఈ మేరకు కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో తాత్కాలికంగా నియమించిన ఆర్‌ఎంసీని శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
 
గెజిట్‌ అమలుపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నప్పటికీ జలవిద్యుత్‌ కేంద్రాల విషయం మరింత జటిలంగా మారింది. గెజిట్‌ అమలు కావాలంటే కృష్ణా, గోదావరి బోర్డుల నుంచి ప్రతిపాదనలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరాలి. ప్రతిపాదనలకు ప్రభుత్వాలు అంగీకారం తెలుపుతూ అధికారికంగా ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలి.
 
ఈ ప్రక్రియ సజావుగా అమలు కావాలంటే తాము బోర్డుల ముందుంచిన నిర్దిష్ట ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలను కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిందేనని ఏపీ పట్టుబడుతోంద. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ ప్రాజెక్టులను అప్పగించేది లేదని తెలంగాణ తెగేసి చెబుతోంది. ఏపీ, తెలంగాణల మద్య సాగునీటి యుద్ధానికి విద్యుదుత్పత్తే బీజం నాటింది. బోర్డుల పరిధిలోకి తొలిదశలో వచ్చే ప్రధాన ప్రాజెక్టుల్లో జలవిద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. శ్రీశైలం జలాశయం ఆధారంగా తెలంగాణ పరిధిలో ఉన్న ఎడమగట్టు- జలవిద్యుత్‌ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పంపు హౌస్‌ లు, నాగార్జున సాగర్‌ పరిధిలోని రెండు జలవిద్యుత్‌ కేంద్రాలు బోర్డుల పరిధిలోకి తీసుకు వచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు.

దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జల విద్యుత్‌ కేంద్రాలను అప్పగించే పనే లేదంటోంది. ఏపీ కూడా జలవిద్యుత్‌ కేంద్రాలను విడిచిపెట్టి గెజిట్‌ అమలు చేయటానికి వీలు లేదంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఏపీలో ఉన్న కుడిగట్ట జల విద్యుత్‌ కేంద్రాన్నీ, నాగార్జునసాగర్‌ పరిధిలోని కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రాన్ని అప్పగించేందుకు ఏపీ ఆమోదం తెలిపింది.

తెలంగాణలోని జలవిద్యుత్‌ కేంద్రాలను బోర్డుల పరిధిలోనే చేరిస్తేనే తమ ప్రాజెక్టులను కూడా అప్పచెబుతామని స్ఫష్టం చేసింది. కృష్ణా బోర్డు కూడా రెండు రాష్ట్రాల్ల్రోని సాగర్‌, శ్రీశైలం పరిధిలోని జలవిద్యుత్‌ కేంద్రాలను తొలి దశ జాబితాలో చేర్చింది. బోర్డులు చేర్చినా వాటికి అంగీకరించి అప్పచెప్పాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే.

ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే సమస్యలుండటంతో సున్నితమైన గెజిట్‌ అమలును తాత్కాలికంగా పక్కనపెడితేనే మంచిదన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవంక, కార్యాలయాలు, సిబ్బంది, ఫర్నీచర్‌  ఇతర మౌలిక వసతుల మా-టె-లా ఉన్నా గెజిట్‌ అమలు కోసం బోర్డులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రూ 200 కోట్ల చొప్పున సీడ్‌ మనీని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికిపుడు ఆ స్థాయిలో వ్యయ భారాన్ని భరించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఇదే విషయమై రెండు రాష్ట్రాల్ర ఉన్నతాధికారులను బోర్డులు అడిగినా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. వ్యయ ప్రణాళికను అందచేస్తే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతామని మాత్రమే చెప్పారు.

కేవలం సీడ్‌ మనీనే కాకుండా ప్రాజెక్టుల వద్ద విధులు నిర్వహించే కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సిఐఎస్‌ఎఫ్‌) జీత భత్యాలను కూడా రెండు రాష్ట్రాలు భరించాలి. సిఐఎస్‌ఎఫ్‌ కోసం ఏడాదికి రూ 150 కోట్లు అవసరమని అంచనా.