మోదీ – పుతిన్ ఫోన్ సంభాషణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ , రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య శుక్రవారం కొద్ది సేపు ఫోన్ సంభాషణ సాగింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశలో మరిన్ని చర్చలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు సంకల్పించారు.  వీరి సంభాషణ అర్థవంతంగా జరిగిందని రష్యా అధికారిక కేంద్రం అయిన క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్ ఘర్షణపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. రష్యాలో ఇటీవల జరిగిన తిరుగుబాటు గురించి, ప్రిగోజిన్ వ్యవహారం గురించి పుతిన్ ఈ దశలో పుతిన్ తెలిపారు.

ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై దృష్టి సారించారు. భారత్ సారధ్యంలో ఇటీవలి జరిగిన షాంఘై సహకార సదస్సు నేపథ్యంలో ఇరువురు నేతల నడుమ జరిగిన పరోక్ష సమావేశం తరువాత ఇప్పుడు ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. దౌత్య ప్రక్రియలో ఘర్షణను నివారించుకోవాలని పుతిన్ చేసిన సూచనను ఉక్రెయిన్ తోసిపుచ్చిందని ఈ దశలో ప్రధాని మోదీకి తెలియచేశారు. ఉక్రెయిన్‌లో ఇప్పటి సైనిక చర్యను పుతిన్ వివరించారు.

మరోవంక, పుతిన్ భారత ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా మోడీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని, ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారాయన.

‘మా మిత్ర దేశం భారత్, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు. కొన్నేళ్ల కిందట ఆయన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. సమర్థవంతంతగా దానిని దేశంలో అమలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది’ అని మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ పేర్కొన్నారు.

దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో లాంటి అభివృద్ధిని సాధించవచ్చో ప్రధాని మోదీ భారత్‌లో చేసి చూపించారని, రష్యా దానిని ఆదర్శంగా తీసుకోవాలని పుతిన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. మనం కాకున్నా మన స్నేహితుడు చేసిందైనా సత్ఫలితాలిస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదని పుతిన్ అన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు నాయకుడు యెవెగ్నీ ప్రిగోజిన్ నేతృత్వంలో తిరుగుబాటు అనంతరం పుతిన్ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.