బియ్యం ఇవ్వలేం, డబ్బులు ఇస్తాం.. సిద్ధరామయ్య యూటర్న్

ఐదు ఉచిత హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చడంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి అన్న భాగ్య పథకం. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు.

అయితే, కర్ణాటకలో ఈ పథకం అమలు కోసం అవసరమైన బియ్యం అందుబాటులో లేవు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రయత్నించింది. అయినా కూడా, అవవసరమైన బియ్యాన్ని సేకరించలేకపోయింది. దాంతో, లబ్దిదారులకు బియ్యం ఇవ్వలేమని, అందుకు బదులుగా డబ్బులు ఇస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఒక్కో కేజీకి రూ. 34 చొప్పును ఐదు కేజీలకు ఒక్కో లబ్దిదారుడికి రూ. 170 నెలకు ఇస్తామని ఆయన తెలిపారు.

 ప్రస్తుతానికి నగదు రూపంలో ఇస్తామని, తరువాత ఈ పథకం అమలుకు అవసరమైన స్థాయిలో బియ్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్లీ బియ్యం ఇవ్వడం ప్రారంభిస్తామని వివరించారు. దీనిపై కర్నాటకలోని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా గడవక ముందే, హామీలపై వెనుకడుగు వేస్తోందని విమర్శిస్తోంది. అయితే, బియ్యం సేకరణ విషయంలో కేంద్రం తమను మోసం చేసిందని, ఎఫ్సీఐ నుంచి బియ్యాన్ని రాష్ట్రానికి పంపించకుండా ఇబ్బంది పెడ్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

మరోవంక, రాష్ట్రంలోని వినియోగదారులకు ఉచిత విద్యుత్ ను అందించే గృహ జ్యోతి పథకం కూడా అమలుకు ముందే విమర్శలకు గురవుతోంది. పేదలు, సామాన్యులకు కూడా వేలల్లో కరెంట్ బిల్లు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా గత గురువారం రాష్ట్ర వ్యాప్త బంద్ కూడా పాటించారు. పవర్ సప్లై కంపెనీల బిల్లింగ్ లో తప్పుల కారణంగా అలా ఎక్కువ బిల్లు వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.