తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి షెంథిల్ బాలాజీని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం తొలగించారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి షెంథిల్ బాలాజీని ఈ నెల 14న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.  కొన్నేండ్ల క్రితం ఉద్యోగాలిప్పిస్తామని ముడుపులు స్వీకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
అలా ముడుపులిచ్చిన వారితో రాజీ కుదుర్చుకోవడాలు, బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు కూడా ఆయన దిగారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిఫారసు లేకుండానే సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం గమనార్హం.  ‘సెంథిల్ బాలాజీ క్యాష్ ఫర్ జాబ్, మనీ లాండరింగ్ తోపాటు పలు అవినీతి కేసుల్లో తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారు. న్యాయ ప్రక్రియకు అడ్డు తగులుతున్నారు` అని రాజ్ భవన్  ఒక ప్రకటన చేసింది.
అయితే, అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా కోరనున్నట్లుగా ప్రకటించిన గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆయన సలహా మేరకు మంత్రివర్గం నుంచి తొలగిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులను గంటల వ్యవధిలోనే నిలుపుదల చేసినట్లుగా గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో మంత్రి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై పలు క్రిమినల్ కేసుల్లో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

`అయినప్పటికీ మంత్రి వర్గంలో సెంథిల్ బాలాజీని కొనసాగించడంపై సహేతుకమైన ఆందోళనలు ఉన్నాయి. నిష్పాక్షిక దర్యాప్తుతోపాటు న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పనితీరు దెబ్బ తినవచ్చు. ఈ పరిస్థితుల్లో తక్షణం క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నాం` అని రాజ్ భవన్ అంతకు ముందు తన ప్రకటనలో తెలిపింది.

ఈ నెలలో సెంథిల్ బాలాజీ అధికారిక నివాసంలోనూ, చెన్నై, కరూర్‌లలో గల ఆయన సోదరుల ఇండ్లపైనా ఈడీ దాడులు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈడీ ఈ తనిఖీలు నిర్వహించింది. 2006లో తొలిసారి అన్నాడీఎంకే నుంచి కరూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 2011లోనూ గెలుపొందారు.

జయలలిత సారధ్యంలోని మంత్రివర్గంలో 2011-16 మధ్య రవాణా మంత్రిగా పని చేశారు. అప్పట్లోనే జాబ్స్ ఫర్ క్యాష్ కుంభకోణం వెలుగు చూడటంతో క్యాబినెట్ నుంచి తొలగింపునకు గురయ్యారు. 2016లో అరవకురిచ్చి స్థానం నుంచి గెలుపొందినా, జయలలిత తన క్యాబినెట్ లోకి సెంథిల్ బాలాజీని తీసుకోలేద.

ఏఐఏడీఎంకేలో చీలిక తర్వాత సెంథిల్ బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ గ్రూపులో చేరారు. సీఎంను మార్చాలంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసినందుకు అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. 2018లో డీఎంకేలో చేరి, అరవకురిచ్చి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు.

2019లో అరవకురిచ్చి, 2021లో కరూర్ నుంచి ఎన్నికయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ కు సెంథిల్ బాలాజీ అత్యంత సన్నిహితుడని సమాచారం. 2021లో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్టాలిన్ మంత్రివర్గంలో సెంథిల్ బాలాజీకి చోటు దక్కింది.  కానీ జాబ్స్ ఫర్ క్యాష్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది.

కానీ, క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని సీఎం స్టాలిన్ తొలగించలేదు. శాఖలేని మంత్రిగా కొనసాగిస్తున్నారు. తాజాగా నేరుగా సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ రవి ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి నిర్ణయంపై సీఎం ఎంకే స్టాలిన్ భగ్గుమన్నారు. తమ క్యాబినెట్‌ మంత్రిని నేరుగా బర్తరఫ్ చేయడానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి అధికారం లేదని తేల్చి చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని గురువారం ప్రకటించారు.