నేషనల్‌ జియోగ్రఫిక్‌ మ్యాగజైన్‌ మూసేస్తున్నారా?

ఆర్థిక మాంద్యం కారణంగా మనుగడ ప్రశ్నార్ధకంగా మారడంతో పలు కార్పొరేట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. వందేళ్ల చరిత్ర ఉన్న నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సైతం పలువురు ఉద్యోగులను తొలగించింది. 100ఏళ్లకు పైగా సహజమైన ప్రపంచాన్ని భౌగోళిక అంశాలను ప్రజలకు వివరించిన మ్యాగజైన్ తమ సంస్థలో మిగిలిన చివరి 19 మంది స్టాఫ్ రైటర్లను తొలగించింది.
 
వచ్చే ఏడాది నుంచి ఏ న్యూస్‌ స్టాండ్‌లోనూ నేషనల్‌ జియోగ్రఫిక్‌ మ్యాగజైన్‌ కనిపించదని వాషింగ్టన్‌ పోస్టు ఓ కథనంలో వెల్లడించింది. అలాగే ఆడియో విభాగంలోనూ పలువురు ఉద్యోగులను తప్పించింది.  నేషనల్‌ జియోగ్రాఫికల్‌ మ్యాగజైన్ 1888లో తొలిసారిగా ప్రచురణను ప్రారంభించింది.  సైన్స్‌, సహజత్వానికి పెద్దపీట వేసేలా కథనాలు ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది.
అయితే వంద ఏండ్లుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ మ్యాగజైన్‌ 2015 నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. అప్పట్నుంచి పలు యాజమాన్యాలు మారుతూ వచ్చిన ఈ మ్యాగజైన్‌ చివరగా డిస్నీ చేతుల్లోకి వచ్చింది. కానీ కరోనా మహమ్మారి తర్వాత ఎదురైన పరిస్థితులతో పాటు మ్యాగజైన్‌ విక్రయాలు తగ్గడం వంటి పలు కారణాలతో డిస్నీ సంస్థ ఖర్చులు తగ్గించుకుంటూ వస్తుంది.
ఈ క్రమంలోనే లేఆఫ్స్‌కి మొగ్గు చూపింది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా ఆరుగురు ఎడిటర్స్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా సిబ్బందిని తగ్గించుకుంటూ వచ్చిన డిస్నీ సంస్ తాజాగా మిగిలిన 19 మంది రైటర్లనూ తొలగించింది. దీంతో ఆ సంస్థతో అనుబంధం ఉన్న రచయితలు సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు.
 
నాట్ జియో తన స్టాఫ్ రైటర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎంతో అదృష్టవంతులమని, నమ్మశక్యం కాని జర్నలిస్టులతో కలిసి పని చేశామని, ఇదో గౌరవమని పేర్కొంది. విజువల్ మీడియాను తట్టుకుని నిలబడేందుకు డిస్నీ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే స్టాఫ్‌ ఉద్యోగులను తొలగించి ఫ్రీలాన్సర్లను నియమించుకుంటున్నది.
అయితే మ్యాగజైన్‌ మూసివేతపై స్పందించిన డిస్నీ రైటర్ల తొలగింపు కారణంగా మ్యాగజైన్‌ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది. ఉద్యోగుల కోత వల్ల మ్యాగజైన్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందనడం సరికాదని పేర్కొంది. ఇకపై మరిన్ని విభిన్న కథనాలతో పాఠకులకు చేరువవుతామని స్పష్టం చేసింది.