ఐరాస వేదికపై ప్రసంగించనున్న కిషన్ రెడ్డి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయం వేదికగా జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన వక్తగా ప్రసంగించే అవకాశం లభించింది. ఇప్పటివరకు ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కావడం గమనార్హం.
 
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ డబ్ల్యుటిఓ) ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్’ (ఎచ్ ఎల్ పి ఎఫ్) సమావేశాల్లో కిషన్ రెడ్డి ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
 
భారతదేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్‌’ హోదాలో కిషన్ రెడ్డి ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటీవల గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలము చేరుకోవడం; అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు)  ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ ఇతివృత్తం (థీమ్)తో జూలై 13, 14 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.
వివిధ దేశాల ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పోషిస్తోంది.  కరోనా కారణంగా అత్యంత నష్టపోయిన రంగాల్లో ఈ పర్యాటక రంగం ఒకటి.
 
ఈ నేపథ్యంలో పర్యాటక రంగ సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. వివిధ దేశాల నాయకులను, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవర్గాలను ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే లక్ష్యంతో అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసేందుకు  యుఎన్ డబ్ల్యుటిఓ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్వహిస్తోంది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో సాధించిన ప్రగతిని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ ఎచ్ ఎల్ పి ఎఫ్ వేదికగా సమీక్షించనున్నారు. సభ్యదేశాలు, ఐక్యరాజసమితి ఏజెన్సీలు, పౌరసమాజం, ఇతర భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తమ అనుభవాలను పంచుకోవడం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అమలుచేస్తున్న ఉత్తమ పద్ధతులనుఅమలుచేయడంపై, సాధించిన ఫలితాలను, చేరుకోవాల్సిన  లక్ష్యాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై ఎచ్ ఎల్ పి ఎఫ్ చర్చిస్తుంది.
 
ఈ ఏడాది ‘కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక రంగ అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఉద్దేశించిన 2030 అజెండా అన్ని స్థాయిల్లో అమలు’పై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మరీ ముఖ్యంగా స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అందుబాటు ధరల్లో క్లీన్ ఎనర్జీ, పరిశ్రమలు, సృజనాత్మకత – మౌలికవసతుల కల్పన, సుస్థిర నగరాలు, కమ్యూనిటీస్, లక్ష్యాల సాధనకోసం భాగస్వామ్యాలు అనే అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
 
పర్యాటకం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మధ్య అనుసంధానత కోసం ఈ కార్యక్రమం చాలా అత్యవసరమైనది. విధానపర నిర్ణయాలను అమలులోకి తీసుకొస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన ఫలితాలను తీసుకొచ్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక కోసం ఈ వేదిక కృషిచేస్తోంది. 
 
జి 20 సమావేశాలకు ఇండియన్ ప్రెసిడెన్సీ ద్వారా అందిన అత్యున్నత స్థాయి మార్గదర్శనం,  యుఎన్ డబ్ల్యుటిఓ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతోపాటుగా క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా విధానపర నిర్ణయాలను డేటా రూపంలోకి తీసుకొస్తూ.. పర్యాటక రంగ అభివృద్ధికి ఈ సమావేశం ఓ వేదిక కానుంది. దీంతోపాటుగా ప్రజల శ్రేయస్సు, భూ మండలంపై పర్యాటక రంగ ప్రభావాన్ని కూడా ట్రాక్ చేయాల్సిన కీలక తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
గోవా రోడ్‌ మ్యాప్ ను (గోవాలో జరిగిన జీ20 సమావేశాల్లో సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు) ను ప్రవేశపెట్టడం,  యుఎన్ డబ్ల్యుటిఓ – జెఐసిఎ  ఉమ్మడి ప్రచురణ ‘పర్యాటకం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం; టూల్‌కిట్ ఆఫ్ ఇండికేటర్స్ ఫర్ ప్రాజెక్ట్స్ (టిప్స్)’ ల్లో పేర్కొన్న అంశాలను అర్థం చేసుకోవడం చేయనున్నారు.
 
దానితోపాటుగా సృజనాత్మకమైన, వేగవంతమైన, ఆచరణాత్మకమైన విధానపర నిర్ణయాల రూపకల్పన కోసం.. బిజినెస్ మోడల్స్ లో తీసుకురావాల్సిన మార్పులు, పర్యాటక రంగ నిర్వహణ కోసం.. విధాన నిర్ణేతలు (పాలసీ మేకర్స్), ప్రైవేటు రంగం మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం చేపడుతున్న అంశాలను (గ్లోబల్ ఎఫర్ట్స్) తీసుకోవాల్సిన అంతర్జాతీయ ప్రయత్నాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా పర్యాటకంలో సుస్థిరతకు కొలమానం, ఇ ఎస్ జి (ఎన్విరాన్‌మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్) ఫ్రేమ్‌వర్క్ తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.