రూ.100కి చేరుకున్న టమాటా, పచ్చిమిర్చి ధరలు

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోవడం, దిగుబడి భారీగా తగ్గిపోవడం వల్ల కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. టమాటా, పచ్చిమిర్చికి మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఏర్పడింది. గత కొద్దిరోజులుగా మార్కెట్‌లో టమాటా, మిర్చి ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ప్రస్తుతం కేజీ టమాట రూ.100కు చేరుకోగా.. మిర్చి కేజీ రూ.120 పలుకుతోంది. దీంతో అంత ధర పెట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
 
గత కొంతకాలం క్రితం కేజీ టమాటా రూ.20 లేదా రూ.40కే వచ్చేవి. కానీ క్రమక్రమంగా గత కొద్ది రోజులుగా ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. వారం రోజుల క్రితం కేజీ టమాట ధర రూ.50గా ఉండగా, ఆదివారం ఏకంగా రూ.100కి చేరుకున్నాయి. కొన్ని చోట్ల రూ 120కు కూడా చేరుకుంది.   దీంతో సామాన్య ప్రజలు తక్కువ మొత్తంలోనే టమాటాలను తీసుకుంటున్నారు. మరికొంతమంది అయితే తీసుకోవడమే మానేస్తారు.
 
టమాటాలతో పాటు నిత్యం కూరల్లో ఉపయోగించే పచ్చిమిర్చి ధర కూడా పెరిగింది. కేజీ రూ.40 లేదా రూ.60కి లభించే పచ్చిమిర్చి  ఇప్పుడు రూ.120కి చేరుకుంది. దీంతో ప్రజలు పచ్చిమిర్చిని తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తున్నారు. ధరలు పెరగడం వల్ల కేజీ తీసుకునేవారు అరకేజీ మాత్రమే టమాటా, పచ్చిమిర్చి తీసుకుంటున్నారు.
 
ధరలు పెరుగుదల వల్ల టమాటా, పచ్చిమిర్చిని వినియోగదారులు తక్కువగా తీసుకుంటున్నారని కూరగాయల షాపుల యాజమానుల చెబుతున్నారు. అయితే పచ్చిమిర్చి కొనలేక దానికి బదులు కొంతమంది కూరల్లో తక్కువ ధరకు లభించే చిల్లీ పౌడర్‌ను ఉపయోగిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలతో కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నాయి. అనంతరం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయల దిగుబడి కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు.
పలుచోట్ల వర్షాలు తక్కువగా పడుతుండటంతో క్రమంగా టమాటాలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈమారు టమాట సాగు తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది చిక్కుడుకు మంచి ధర పలకడంతో ఈమారు అనేక మంది ఈ పంటసాగువైపు మళ్లారు. దీనికి తోడు వర్షపాతం తక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. ఉల్లి, బంగాళదుంప మినహా ఇతర కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
తెలంగాణలో టామాట, పచ్చిమిర్చి పంట లేకపోవడంతో ఏపీలోని చిత్తూరు, మదనపల్లె, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడకు వ్యాపారులు తెచ్చుకుంటున్నారు. దీంతో రవాణా ఛార్జీలు కూడా అధికం కావడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
 
మరికొద్ది రోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పంట దిగుబడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. టమాటా, పచ్చిమిర్చి అనేవి వంటిట్లో తప్పనిసరిగా అవసరం. దాదాపు అన్ని కూరల్లోనూ వాటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ధరలు పెరగడంతో చాలామంది కూరల్లో వాడటం మానేసే పరిస్థితి వచ్చింది.