ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర?

బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆయన భార్య ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటలను హత్య చేసేందుకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు.

 రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తమకు తెలిసిందని జమున తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే కౌశిక్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. అయితే, ఈటలను చంపిస్తామంటే తాము భయపడమని ఆమె స్పష్టం చేశారు. పైగా తన భారత రాజేందర్ పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని సహితం ఆమె తీవ్రంగా ఖండించారు.

ఈటల రాజేందర్ పార్టీ మార్పు ప్రచారం మాత్రమే అంటూ బీజేపీలో తాము సంతృప్తికరంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.  బీజేపీలో ఈటలకు ప్రాధాన్యత లేదనేది అవాస్తవం అంటూ పదవుల కోసం ఈటల రాజేందర్ తల వంచరు.. పాకులాడరని ఆమె తేల్చి చెప్పారు. మరోవంక, తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు.

 తమ కుటుంబానికి ఏం జరిగినా ముఖ్యమంత్రి కెసిఆర్‌దే బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని, కానీ తాము వాటిని ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ఆమె  ప్రశ్నించారు. రూ.20 కోట్లు కాదని, ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్తారని ఆమె హెచ్చరించారు. శాడిస్టులను పక్కన పెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

‘కౌశిక్ రెడ్డిని కేసీఆర్ హూజారాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారు. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు. హుజూరాబాద్‌లో అమరవీరుల స్థూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలి. పిచ్చికుక్కలా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. అమరవీరుల స్థూపాన్ని పడగొట్టించిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అమరవీరులను కేసీఆర్ కించపరుస్తున్నారు” అంటూ ఆమె విమర్శించారు.

హుజూరాబాద్ ప్రజలు, మహిళల పట్ల ఇష్టానుసారంగా పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్సీ పిచ్చి చేష్టలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని జమున తేల్చి చెప్పారు.అమరవీరుల స్థూపం తాకే అర్హత ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి లేదని ఆమె మండిపడ్డారు.  అమరవీరుల స్థూపం పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తామని ఆమె తేల్చి చెప్పారు.

శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి కూల్చి వేయించారని ఆమె విమర్శించారు.  మహిళా గవర్నర్‌ను ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడ్డారు. హుజూరాబాద్‌ను మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డికి అప్పజెప్పాలని చూస్తున్నారని అంటూ ఈటల రాజేందర్ పుణ్యాన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు.
 
హుజురాబాద్ కో-సర్పంచ్‌లపై కౌశిక్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతారన్న నమ్మకంతో హుజూరాబాద్‌లో ఈటలను గెలిపించారని చెబుతూ ఇప్పుడు గుర్తింపు కోసం ఈటలను కౌశిక్‌రెడ్డి తిడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.