ఆ పార్టీలొస్తే లక్షల కోట్ల అవినీతికి గ్యారంటీ!

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడుతూ ఆ పక్షాలు అధికారంలోకి వస్తే లక్షల కోట్ల అవినీతికి గ్యారంటీ అని ప్రజలకు చెప్పాలని బీజేపీ కార్యకర్తలను కోరారు.
భోపాల్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ  కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష పార్టీలు ఫొటోలు తీసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయని, ఆ  ఫొటోను చూసినపుడు, దానిలోని ప్రతి ఒక్కరూ రూ.20 లక్షల కోట్ల అవినీతికి గ్యారంటీ అని అర్థమవుతుందని ప్రధాని ధ్వజమెత్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీయే లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు.
 
వచ్చే ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు గత వారం పాట్నాలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల భేటీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఈసారి గతం కన్నా ఎక్కువ ఆందోళనతో ఉన్నాయని దుయ్యబట్టారు. 2014లో కానీ, 2019లో కానీ బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళన చెందలేదని పేర్కొన్నారు.
 
ఈసారి శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారని చెబుతూగతంలో ఒకరిని మరొకరు దూషించుకున్నవారు, ఇప్పుడు ఒకరికి మరొకరు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని ఎద్దేవా చేసారు. వారి పట్ల కోపం ప్రదర్శించవద్దని, జాలిపడాలని కోరారు. కొందరు వ్యక్తులు కేవలం తమ పార్టీ కోసం మాత్రమే జీవిస్తారని, తమ పార్టీకి మాత్రమే లబ్ధి చేకూర్చాలని వారు కోరుకుంటారని దయ్యబట్టారు.
 
అవినీతి, కమిషన్లు, కట్ మనీ నుంచి తమకు వాటా లభిస్తుందనే కారణంతో వారు ఈ విధంగా చేస్తారని ప్రధాని ఆరోపించారు. శ్రమించి పని చేయాలని వారు కోరుకోరని, అందుకే ఈ మార్గాన్ని వారు ఎంచుకున్నారని చెప్పారు. కుంభకోణాలకు పాల్పడటంలోనే ఈ పార్టీలకు అనుభవం ఉందంటూ కుంభకోణాలకు పాల్పడటమే వారి దగ్గర ఉన్న గ్యారంటీ అని దుయ్యబట్టారు.
 
ఈ గ్యారంటీని అంగీకరించాలా? వద్దా? అని దేశం నిర్ణయించాలని తెలిపారు. అయితే మోదీ ఇచ్చే గ్యారంటీ ఒకటి ఉందని, అది ప్రతి అవినీతిపరుడిపైనా, కుంభకోణానికి పాల్పడే ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకోవడమే ఆ గ్యారంటీ అని ప్రధాని హెచ్చరించారు.
ఐదు వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అంతకు ముందు భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా, మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
కాగా బెంగళూరు-హుబ్లీ బాలాసోర్ ప్రమాదం తర్వాత తొలిసారిగా ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి.  ఈరోజు ప్రారంభమైన వందే భారత్ రైళ్లు దేశంలోని 6 రాష్ట్రాలను కలుపుతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్‌, ఝార్ఖండ్‌తో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 23 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, బీహార్, జార్ఖండ్, గోవాలో తొలిసారిగా వందే భారత్ రైలు కూతపెట్టనుంది. మరోవైపు వచ్చే ఏడాదిలోగా దేశంలో 75 వందేభారత్ రైళ్లు నడపనున్నట్లు గత ఏడాది ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.