ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని ఎన్నికల శంఖారావం

2024 ఎన్నికల్లో ఉమ్మడి పౌరస్మృతి కీలక అంశం కాగలదని సంకేతం ఇస్తూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ట్రిపుల్ తలాక్‌, ఉమ్మడి పౌరస్మృతిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస్లిం మెజారిటీ ట్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిది అయితే ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాలలో ఎందుకు పాటించడం లేదని మోదీ ప్రశ్నించారు.
 
ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ‘ఒక కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండటం కుదరదు.. ఒక దేశం రెండు చట్టాలపై నడవదు’ అని ప్రధాని స్పష్టం చేశారు. అంతేకాదు, 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు దాదాపు 90 ఏళ్ల కిందటే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.
‘ట్రిపుల్ తలాక్‌ను సమర్దించేవారు ఓటు బ్యాంకు కోసం ఆకలితో ఉన్నవాళ్లు.. ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు’ అని ప్రధాని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ కేవలం మహిళకు సంబంధించింది మాత్రమే కాదని, మొత్తం కుటుంబాలను కూడా నాశనం చేస్తుందని ప్రధాని హెచ్చరించారు.
 
ఓ కుటుంబంలోని వ్యక్తిని ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న మహిళను ట్రిపుల్ తలాక్ చెప్పి వెనక్కి పంపడం వల్ల ఆమె తల్లిదండ్రులు, సోదరులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం కుమార్తెల స్వేచ్ఛను అణచివేయడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
 
అందుకే ముస్లిం సోదరీమణులు, కుమార్తెలు తాను ఎక్కడికి వెళ్లినా బీజేపీకి, మోదీకి అండగా నిలుస్తున్నారని ప్రధాని చెప్పారు. కాగా, ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించే వారిపై కూడా ప్రధాని విరుచుకుపడ్డారు. వారు తమ ప్రయోజనాల కోసం కొంతమందిని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.  ‘ఏ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టి నాశనం చేస్తున్నాయో భారతీయ ముస్లింలు అర్థం చేసుకోవాలి. మన రాజ్యాంగం కూడా పౌరులందరికీ సమాన హక్కుల గురించి మాట్లాడుతుంది.  ఉమ్మడి పౌరస్మృతిను అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా కోరింది’ అని ఆయన తెలిపారు.
 
బీజేపీపై నిందలు వేసేవారు నిజంగా ముస్లింల శ్రేయోభిలాషులైతే సమాజంలోని చాలా కుటుంబాలు విద్య, ఉపాధిలో వెనుకబడి ఉండేవి కావని, కష్టాలతో జీవితాన్ని గడపాల్సి దుస్థితి ఉండేది కాదని మోదీ ధ్వజమెత్తారు.