తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కోసం వామపక్షాల పాట్లు

1955లో నాటి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు ముందే అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ మంత్రివర్గాన్ని కూడా ప్రకటించిన వామపక్షాలు క్రమక్రమంగా తెలుగు నెలలో ఉనికి కోల్పోతున్నాయి. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొంటే గాని చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతకాలం టిడిపి, కాంగ్రెస్ లతో ఒకొక్క ఎన్నికల్లో పొత్తు పెట్టుకొంటూ చట్టసభలలో ప్రవేశిస్తుండేవారు.
 
రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో రెండు కమ్యూనిస్ట్‌ పార్టీలు ఒక సీటు కూడా గెలుపొందలేదు. 2014 అసెంబ్లి ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు తెలంగాణాలో చెరో సీటును మాత్రం పొందాయి. 2018 ఎన్నికల్లో ఉన్న రెండు స్థానాల్ని కోల్పోయాయి. దీంతో ఇప్పుడు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ రెండు అసెంబ్లిల్లోనూ సీపీఐ, సీపీఎంలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పైగా, రాష్త్ర విభజన అనంతరం ఆ పార్టీలతో పొత్తు కోసం ఏ ప్రధాన పార్టీ కూడా ఆసక్తి చూపడం లేదు.
 
1995లో ఎన్‌టీఆర్‌తో పొత్తులో 37 స్థానాల్లో ఆ పార్టీలు పోటీ చేసి, 34 స్థానాల్లో గెలుపొందాయి. ఉమ్మడి ఏపీలో గరిష్ట స్థానాల్ని సాధించడం ఎన్‌టీఆర్‌ హయాంలోనే. 1999లో రెండు పార్టీలు కలసి ఆరు సీట్లు మాత్రమే విజయానికి పరిమితమయ్యాయి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లతో కలసి పోటీ చేశాయి. సీపీఐ 12 చోట్ల పోటీపడి ఆరు చోట్ల గెలుపొందింది. సీపీఎం 14 స్థానాల్లో పోటీ చేసి 9 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది.
2009నాటికి కాంగ్రెస్‌కు వామపక్షాలు దూరమయ్యాయి. టీడీపీతో కలిపి మహాకూటమిలో భాగమయ్యాయి. ఈ సారి సీపీఐ 4 స్థానాల్లో, సీపీఎం ఓ స్థానంలోనే గెలుపొందాయి. రాష్ట్ర విభజనానంతరం ఈ పార్టీలు పూర్తిగా తెలంగాణాకే పరిమితమయ్యాయి. అంతర్గత ఆధిపత్య పోరాటాలు, నాయకుల మధ్య అనైక్యత, సిద్ధాంతాలకు దూరంగా సొంత ప్రయోజనాలకు పరిమితం కావడం వంటి కారణాలతో ఆ పార్టీలు ప్రజాదరణను కోల్పోయాయి.

ఈసారి ఎన్నికల్లోనైనా కనీసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లిల్లోకి అడుగెట్టాలని ఈ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. మునుగోడు అసెంబ్లి ఉపఎన్నికల్లో వామపక్షాలు బేషరతుగా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలుపునకు వామపక్షాల మద్దతు కూడా ఓ కారణమంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో తెలంగాణాలో బీఆర్‌ఎస్‌తో పొత్తుంటుందని, తద్వారా తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశింప వచ్చని వామపక్షాలు ఆశించాయి.
అయితే, ఆ తర్వాత కేసీఆర్ పొత్తు విషయం ప్రస్తావించడం లేదు. చెరో రెండు సీట్లు మాత్రమే కోరుకొంటున్నా, వామపక్షాలు కీలక సీట్లపై కన్నేయడంతో వాటికిస్తే ఓటమిని ఆహ్వానించడమే అనే భావన బిఆర్ఎస్ నేతలలో వ్యక్తం అవుతుంది. మరోవంక, ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి సదస్సులో వామపక్షాలు కూడా పాల్గొనడంతో కాంగ్రెస్ తో పొత్తు సాధ్యమవుతుందని అంచనా ఇప్పుడు వేసుకొంటున్నాయి.

తెలంగాణాలో బిఆర్ఎస్ తిరోగమనంలో ఉందని, ఆ పార్టీతో పొత్తు రాజకీయంగా కలిసిరాదని నిర్ధారణకు వచ్చిన్నట్లు స్పష్టం అవుతుంది. బీజేపీని నిలువరించడంలో బీఆర్‌ఎస్‌ వెనుకబడిందని, పొత్తులకు తమకు కొత్త ఆప్షన్‌ దొరికిందని, బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్‌ పార్టీతోనైనా జట్టు కట్టడానికి సిద్ధమని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో అధికారానికి పోటీపడే ప్రధాన పక్షం కాంగ్రెసేనని రెండు వారాల క్రితం చెప్పడం ద్వారా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తమ ఉద్దేశం ఇప్పటికే స్పష్టం చేశారు.

ఏదేమైనా, బిఆర్ఎస్, కాంగ్రెస్ – రెండు పార్టీలతో బేరాలాడి, ఎవ్వరు ఎక్కువ సీట్లు ఇస్తే వారితో వామపక్షాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా తెలంగాణాలో ఒకటో, రెండో సీట్లు గెలుచుకునే అవకాశాలు వారికి కనిపిస్తున్నా, ఏపీలో ఉనికిలో లేని ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. టిడిపితో పొత్తుకు బిజెపి సిద్దంకానీ పక్షంలో టిడిపితో పొత్తు పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాల్సి ఉంది.