పాట్నాలో జరుగుతున్నది ఫోటో సెషన్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలు పాట్నాలో సమావేశం కావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  ఛలోక్తులు విసిరారు. పాట్నాలో ఒక ఫోటో సెషన్  జరుగుతోందని, వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఎన్డీయేను ఓడించాలని అనుకుంటున్నారని చెప్పారు.  జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ విపక్షాలు ఎప్పటికీ ఏకతాటిపైకి రాలేవని అమిత్ షా జోస్యం చెప్పారు.
ఎవరెన్ని చెప్పినా మళ్లీ ప్రధాని మోదీనే అంటూ వచ్చే ఎన్నికల్లో 300పైగా సీట్లు గెలుస్తామని షా ధీమా వ్యక్తం చేశారు.  ‘పాట్నాలో ప్రతిపక్ష నాయకుల ఫొటో సెషన్ జరుగుతోంది చూడండి. వారెన్ని ప్రయత్నాలు చేసినా.. వారిలో ఐక్యత సాధ్యం కాదు. ఒకవేళ వారంతా కలిసి పోటీ చేసినా.. మోదీజీ 300 పైగానే సీట్లను గెలిపిస్తారు. మళ్లీ ప్రధాని అవుతారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
 
లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్ పట్ల గతంలో కాంగ్రెస్ దారుణంగా ప్రవర్తించిందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా గుర్తు చేశారు. లాలూ, నీతీశ్ ను రాహుల్ నానమ్మ ఇందిర జైల్లో పెట్టించారని నడ్డా వెల్లడించారు. ఇప్పుడు రాహుల్ లాలూ, నీతీశ్ స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు.  లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు 22 నెలలు జైలు శిక్ష విధించగా, నీతిష్‌కుమార్ 20 నెలల పాటు కటకటాల వెనక్కి వెళ్లాడని నడ్డా తెలిపారు.
ఈ రాజకీయ సిత్రాలు చూసి ఆశ్చర్యపోతున్నానని నడ్డా పేర్కొన్నారు. ఉద్ధవ్ థాక్రే తండ్రి బాలాసాహెబ్ థాక్రే ఎప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించేవాడని, హిందూ హృదయ సామ్రాట్ అయిన బాలా సాహెబ్ కాంగ్రెస్‌ను అంతటా వ్యతిరేకించేవాడని నడ్డా పేర్కొన్నారు.  ఒకవేళ కాంగ్రెస్‌‌తో కలిసే పరిస్థితి వస్తే తాను దుకాణం మూసివేస్తానని బాలాసాహెబ్ చెప్పేవాడని నడ్డా తెలిపాడు. ఇప్పుడు ఆయన కొడుకు దుకాణం మూసేస్తున్నాడు అని ఆయన విమర్శించారు.

ఒడిశా కలహండి బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ నేతలు ప్రశంసించడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని నడ్డా ఆరోపించారు. కుటుంబ రాజకీయాలను మోదీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దేశంలో అభివృద్ధి రాజకీయాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

తాము ఒంటరిగా బిజెపిని ఓడించలేమని గ్రహించిన కాంగ్రెస్, ఇతర పార్టీలను కలుపుకుంటోందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. అయినప్పటికీ తామే విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగా ఓడించలేమనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా బాహాటంగా వెల్లడించినందుకు ఆమె కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.