పాట్నా భేటీలో కుదరని ఏకాభిప్రాయం.. సిమ్లాలో మరో భేటీ

2024 సార్వ‌త్రిక స‌మ‌రంలో పాల‌క బీజేపీని మ‌ట్టిక‌రిపించే ల‌క్ష్యంతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో శుక్రవారం జ‌రిగిన విప‌క్షాల భేటీ  అసంపూర్తిగా ముగిసింది. ఈ స‌మావేశంలో ఏకాభిప్రాయం వ్య‌క్తం కాక‌పోవ‌డంతో త్వ‌ర‌లో సిమ్లాలో మ‌రోసారి భేటీ కావాల‌ని విప‌క్ష నేతలు నిర్ణ‌యించారు.
బీజేపీని దీటుగా నిలువ‌రించేందుకు విప‌క్ష నేత‌లు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఈ భేటీలో ఏకాభిప్రాయం వ్య‌క్త‌మైనా అందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై నేత‌లు ఓ అంగీకారానికి రాలేక‌పోయారు.
ఈ స‌మావేశంలో విప‌క్షాల్లో కొన్ని పార్టీలు ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం దుమారం రేపింది. బిహార్ సీఎం నితీష్ కుమార్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ భేటీలో బెంగాల్‌లో కాంగ్రెస్ తీరును ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌ప్పుప‌ట్ట‌గా, టీఎంసీని దొంగ‌ల పార్టీగా కాంగ్రెస్ నేత అధీర్ రంజ‌న్ చౌధ‌రి అభివ‌ర్ణించారు. మ‌నలో మ‌నం విభేదాల‌తో వీధికెక్కితే అంతిమంగా బీజేపీకి ల‌బ్ధి చేకూరుతుంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అసహనం వ్యక్తం చేశారు.
 
కాగా, ఢిల్లీ ఆర్డినెన్స్ విష‌యంలో పార్టీల‌న్నీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కోర‌గా, ఆర్టిక‌ల్ 370పై కేజ్రీవాల్ వైఖ‌రిని ఒమ‌ర్ అబ్ధుల్లా త‌ప్పుప‌ట్టారు.  సమావేశం అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశానికి  గైరాజరైన ఆప్, ఈ ఆర్డినెన్సు పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయని పక్షంలో తదుపరి సమావేశాలకు హాజరు కావడం సాధ్యం కాదని సమావేశం తర్వాత ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
 
బృందం నేతగా రాజ్యసభలో కాంగ్రెస్ కు చెందిన మొత్తం 31 మంది ఎంపీలు ఈ ఆర్డినెన్సు ను వ్యతిరేకిస్తారని ప్రకటించని పక్షంలో కాంగ్రెస్ భాగస్వామ్యం గల సమావేశాలలో ఇక ముందు పాల్గొనలేమని తేల్చి చెప్పింది.   అయితే, 2024 సమావేశంలో అందరం కలిసి పోటీచేయాలని నిర్ణయ్హించినట్లు సమావేశం అనంతరం నితీష్ కుమార్ తెలిపారు.  సీట్ల సర్దుబాటు గురించి జులై 10 లేదా 12న సిమ్లాలో జరిగే భేటీలో  చర్చిస్తామని తెలిపారు.
విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, కలిసికట్టుగానే ఎన్నికల్లో పోరాడతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ చెప్పారు.  ఇది సిద్ధాంతాల మధ్య పోరు అని చెబుతూ నిజానికి, తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని, సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషిచేయాలని నిర్ణయించామని రాహుల్ గాంధీ చెప్పారు.  కాగా,  క‌నీస ఉమ్మ‌డి కార్య‌క్ర‌మం రూపొందించాల‌ని ఈ స‌మావేశంలో ప‌లు పార్టీలు అభిప్రాయ‌ప‌డ్డాయ‌ని తెలిసింది. విప‌క్ష కూట‌మికి ఓ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను నియ‌మించాల‌నే అంశంపైనా ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబ్ ముప్తి, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు నేటి సమావేశానికి హాజరయ్యారు.