కాశ్మీర్ విలీనం కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదానం

* డా. ముఖర్జీ బలిదానం రోజు 
 
సరిగ్గా 70 సంవత్సరాలక్రితం 1953లో ఇదే రోజున, దేశంలోని అత్యున్నత నాయకులలో ఒకరైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జమ్మూ  కాశ్మీర్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. డాక్టర్ ముఖర్జీ, అవిభక్త బెంగాల్‌లో మంత్రి, తరువాత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో మంత్రి, ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు,  నెహ్రూ విదేశీ లౌకిక రాజకీయాలు పై తీవ్ర విమర్శకుడు. 
 
నేటి బీజేపీ, అప్పట్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ ముఖర్జీ.  హిందూ జాతీయవాదపు ఛాంపియన్. బహుశా దానివల్లే జవహర్‌లాల్ నెహ్రూ వంటి “ఉదారవాద-సెక్యులర్” నాయకులకు ఆయన లక్ష్యంగా మారారు. డాక్టర్  ముఖర్జీ జమ్మూ కాశ్మీర్‌ను భారత భూభాగంలో పూర్తిగా విలీనం చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి.
దానిని సాధించడానికి 1950ల ప్రారంభంలో ప్రసిద్ధ “ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్, ఏక్ నిషాన్” అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాపై నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారానికి నాయకత్వం వహించారు. మే 11, 1953న షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆదేశాల మేరకు డాక్టర్ ముఖర్జీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
ఒక నెల తర్వాత, ఈ జాతీయవాది జూన్ 23న  నిర్బంధంలో ఉన్న సమయంలో మరణించాడు. అయితే, ముఖర్జీ మరణం వెనుక కుట్ర ఉందని అప్పటి నుండి నేటి వరకు పలువురు అనుమానిస్తున్నారు. కారణం?  ఆయన మరణం అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగింది. ఈ మరణం పై అనేక ప్రశ్నలు ఉత్పన్నమై నా, అప్పటి ప్రధాని నెహ్రూ ఎటువంటి నిష్పాక్షిక దర్యాప్తుకు ఒప్పుకోలేదు. విచారణకై ముఖర్జీ భార్య నెహ్రూని స్వయంగా కోరినా ఆమె అభ్యర్థనను పరిశీలించకుండా, సాధారణ మరణంగా నెహ్రు కొట్టి పారేశారు.

అసలు జరిగింది ఏమిటీ?

మే 8, 1953 న ముఖర్జీ గారు ఆయన అనుచరులు గురుదత్ వైద్, వాజపేయి, బాలరాజ్ మధోక్, తేక్ చంద్, కొందరు విలేకరులతో కలసి జమ్మూ వెళ్ళడానికి ఉదయం 6.30కి ఢిల్లీ స్టేషన్ చేరుకున్నారు. నెహ్రూ  జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ఇచ్చాక అక్కడ కాశ్మీర్ ప్రధాని అనుమతి లేకుండా అఖరుకు భారత రాష్ట్రపతి కూడా అక్కడ కాలుపెట్టలేరు. మరొమాటలో చెప్పాలి అంటే జమ్మూ కాశ్మీర్  ప్రభుత్వం ఇచ్చిన పర్మిట్ లేకుండా అక్కడ ఏ భారతీయుడు కాలు పెట్టలేరు.

నెహ్రు తెచ్చిన ఈ దుర్మార్గ చట్టంపై నిరసన తెలపడానికి, దేశ ప్రజలను చైతన్య పరచడానికి ఆమరణ దీక్ష చేయడానికి ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ కు  ప్రయాణమయ్యారు. అయితే ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టిన వెంటనే ఎటువంటి వారెంట్ లేకుండా మే 11న ఆయనను కాశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా అరెస్ట్ చేయించి, శ్రీనగర్ కి దూరంగా నిశాత్ బాగ్ అనే ప్రాంతంలో ఒక పాడు పడిన ఇంటిని జైలుగా మార్చి, దానిలో నిర్బంధించారు.

ముఖర్జీ అప్పటికే ప్లూరసీ, గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయినా దగ్గరలో వైద్య సదుపాయాలు లేని ప్రాంతంలో ఆయనను నిర్బంధించారు. జూన్ 20వ తేదీన ఆయన ఆరోగ్యం అనుమానాస్పదంగా, అకస్మాత్తుగా భారీగా క్షీణించింది. తనకు స్ట్రేప్టోమైసిన్ మందు పడదు అని చెప్పినా డాక్టర్ ముహమ్మద్ అనే అతను లక్ష్య పెట్టుకుండా, `మీ డాక్టర్ ఈ సలహా చాలా రోజులు క్రిందట ఇచ్చాడు, ఈ మధ్యలో చాలా మార్పులు వచ్చాయి, మీరేమీ ఆందోళన చెందనక్కర లేదు’ అని చెప్పి ఆ మందు ఇచ్చాడు. అంతే కాదు నొప్పి తగ్గడానికి అని చెప్పి ఒక పౌడర్ ఇచ్చి, రోజుకు రెండు సార్లు వేసుకోమన్నాడుట.

తన ఆరోగ్యం బాగా క్షీణీస్తోందని తన బంధువులకు తెలుపమని ముఖర్జీ  జైల్ సూపరింటెంట్ ని కోరినా అతను లక్ష్య పెట్టలేదు. అలాగే అతని మరణం వరకు ప్రభుత్వం కూడా ముఖర్జీ ఆరోగ్య విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముందు చూసిన డాక్టర్స్ ఎవరూ మళ్ళీ ముఖర్జీని చూడడానికి రాలేదు. కానీ మరుసటి రోజు జైల్ డాక్టర్ మాత్రమే చూడడానికి  వచ్చి మళ్ళీ స్ట్రేప్టోమిసైన్ ఇచ్చాడు. 

 
దాని తరువాత ముఖర్జీ గారికి జ్వరం, నొప్పులు ఎక్కువ అయితే, ముఖర్జీ అనుచరుడు వైద్  వెంటనే తనని చూడడానికి రమ్మనమని ముఖర్జీ పంపిన కబురు అందుకుని వచ్చాడు. జూన్ 22 ఉదయం 5.15కి ముఖర్జీ ఆరోగ్యం బాగా క్షీణీస్తోందని అనుచరులు జైల్ సూపరింటెండెంట్ కి చెప్తే, 7.30 డాక్టర్ అలీ మహమ్మద్ వచ్చి పరిస్థితి బాగా లేదు వెంటనే నర్సింగ్ హోమ్ కి తరలించాలి అని చెపితే, జిల్లా మేజిస్ట్రేట్ నుండి ఆర్డర్ తెచ్చుకోమని జైల్ సూపరింటెండెంట్ చెప్పాడు.

ఆ ఆర్డర్ వెంటనే సంపాదించమని డాక్టర్ అలీ మహమ్మద్ ని ముఖర్జీ అనుచరులు కోరగా ఇక్కడ మంచి డాక్టర్లు పర్యవేక్షణలోనే వున్నారు, మీరు ఆందోళన చెందకండి అని చెప్పారట. ఉదయం11.30 జైల్ అధికారులు టాక్సీ తెచ్చి ముఖర్జీని ఏ మంచి నర్శింగ్ హోమ్ లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో చేర్పించారు.

ముఖర్జీ ఆరోగ్యం అసలు బాగాలేదని ఆయన అనుచరులు దత్, చంద్ లకు జైల్ సూపరింటెండెంట్ 23 తెల్లవారుజామున తెలిపితే వారు  ఆసుపత్రికి 4 గంటలకు చేరుకున్నారు. అయితే ముఖర్జీ ఆ తెల్లవారుజామున 3.40కే స్వర్గస్తులు అయినట్లు ఆస్పత్రి అధికారులు వీరికి తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి సమయంలో నిబంధనలు అన్నింటిని తుంగలో తొక్కి కనీసం శవపరీక్ష కూడా నిర్వహించలేదు.

అప్పుడు ప్రధాని నెహ్రు లండన్ పర్యటనలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని మౌలానా ఆజాద్. ముఖర్జీ  పార్థివ శరీరాన్ని ఢిల్లీ కూడా తీసుకురాకుండా నేరుగా కలకత్తాకు విమానంలో తరలించారు. ముఖర్జీ తల్లి జగమయా దేవికి నెహ్రు నుండి సంతాప సందేశం వచ్చింది. 

 
దానికి జవాబుగా తన కుమారుని అనుమానాస్పద మృతిపై.లోతైన విచారణ జరపమని ఆమె నెహ్రుని కోరగా, అది సాధారణ మరణం అని, ఎటువంటి కుట్ర లేదని దానికి సంబంధించిన వారు అందరూ చెప్పారు, వారి మాటలు నేను విశ్వసిస్తున్నాను, మరి విచారణ అవసరం లేదు అని తిరస్కరించారు.

స్వర్గీయ ముఖర్జీ మృతి సాధారణం కాదు. నెహ్రు, అబ్దుల్లా కుమ్మక్కు అయి ఆయన చనిపోయేటట్లు చేశారు అని ఆయనకు ప్రైవేట్ సెక్రెటరీగా పచేసిన అటల్ బిహారీ వాజపేయి తీవ్ర ఆరోపణ చేశారు. ఏ కుట్రా లేకపోతే మృతదేహానికి శవపరీక్ష  కూడా ఎందుకు చేయలేదు? అనేది ఎప్పటికి జవాబు రాని ప్రశ్నగా మిగిలిపోయింది.