డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌కు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేష‌న్‌ అవార్డు

భారత పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన డాక్ట‌ర్ కే వీర‌బ్ర‌హ్మంకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేష‌న్ 2023 పుర‌స్కారం ల‌భించింది.  బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌ర్ణాట‌క హైకోర్టు మాజీ చీఫ్ జ‌స్టిస్ రితూ రాజ్ అవ‌స్థి చేతుల మీదుగా గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేష‌న్ 2023 అవార్డును డాక్ట‌ర్ కే వీర‌బ్ర‌హ్మం అందుకున్నారు.
 
ఈ సంద‌ర్భంగా అవార్డు అందుకున్న డాక్ట‌ర్ కే వీర‌బ్ర‌హ్మంకు ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్ట‌ర్స్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు లేని, భూమిలో క‌లిసిపోయే బ‌యోడీగ్రేడ‌బుల్ సంచులు రూపొందించినందుకు గానూ ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డుకు వీర‌బ్ర‌హ్మంను ఎంపిక చేశారు.

పాలీథీన్ క్యారీ బ్యాగులు భూమిలోకి కానీ, నీటిలో కానీ క‌రిగిపోవు. అవి విచ్ఛిన్న‌మై భూమిలో క‌ల‌వ‌టానికి 300 నుంచి 500 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. దీని వ‌ల్ల భూమి మీద ప్లాస్టిక్ వ్య‌ర్ధాలు విల‌య తాండ‌వం చేసి గాలి, నీటి కాలుష్యాన్ని క‌లుగ జేస్తున్నాయి. క్యారీ బ్యాగుల్లో ఉన్న ఆహారాన్ని సంచితో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఆవులు, ప‌శువులు చ‌నిపోతున్నాయి.

ప్లాస్టిక్ భూతాన్ని అంత‌మొందించ‌డానికి పాలిథీన్ బ్యాగుల‌కు ప్ర‌త్యామ్నాయంగా 120 రోజుల్లో భూమిలో క‌లిసిపోయి ఎరువుగా మారే బ‌యోడిగ్రేడ‌బుల్ బ్యాగుల‌ను మొక్క‌జొన్న‌, బ‌యోపాలిమ‌ర్‌ల‌ను క‌లిపి రూపొందించారు. ఈ బ్యాగుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పులేదు. ప‌శువులు తిన్నా చ‌నిపోవు.

ఈ టెక్నాల‌జీని డీఆర్డీవో ఇప్ప‌టికే 40 కంపెనీల‌కు ఉచితంగా అందించింది. ఇంకా 50 కంపెనీలు ఈ టెక్నాల‌జీ కోసం వినితి ప‌త్రం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. ఈ టెక్నాల‌జీ ఎలా వినియోగించాలి, ఫార్ములా, యంత్రాలు, నాణ్య‌త ప్ర‌మాణాలు, టెక్నాల‌జీ ట్రాన్స్‌ఫ‌ర్ వంటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను వార్తాప‌త్రిక‌లు, యూట్యూబ్ మాధ్య‌మాల‌లో ఉంచింది.

ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పులేని, భూమిలో క‌రిగిపోయే బ‌యోడిగ్రేడ‌బుల్ బ్యాగుల‌ను రూపొందించినందుకు ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డైరెక్ట‌ర్స్‌, ఢిల్లీ ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జాతీయ అవార్డును ఎన్విరాన్మెంట్‌, మేనేజ్మెంట్, క్లైమెటిక్ చేంజ్ 2023 స‌ద‌స్సు నందు బెంగుళూరులో ప్ర‌దానం చేయ‌డం జ‌రిగిన‌ది. విశేష కృషి చేసి ఈ అవార్డు పొందిన డాక్ట‌ర్ కే వీరబ్ర‌హ్మంను మిగిలిన శాస్త్ర‌వేత్త‌లు, ప‌ర్యావ‌ర‌ణ శ్రేయోభిలాషులు అభినందించారు.