నితీష్ భేటీకి ఆదిలోనే కేజ్రీవాల్ అల్టిమేటం!

2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని ఒక వేదికపైకి చేర్చేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం పాట్నాలో జరుగనున్న ఈ భేటీలో 15 పార్టీల అధినేతలు పాల్గొన గలరని భావిస్తున్నారు.
అయితే, గురువారం సాయంత్రం తాను లేవనెత్తిన అంశంపై కాంగ్రెస్ స్పందించని పక్షంలో ఈ భేటీకి తాను హాజరుకాబోనని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అల్టిమేటం ఇచ్చారు. దానితో ఎటూ చెప్పలేక కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది.
 
ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించాలని కోరుతూ కేజ్రీవాల్ వివిధ పార్టీల అధినేతలను కలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎటూ తేల్చలేదు. కనీసం కేజ్రీవాల్ వచ్చి కలిసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇప్పటివరకు స్పందించలేదు.
 
ఢిల్లీ, పంజాబ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి ఆప్ అధికారంలోకి రావడంతో ఈ ఆర్డినెన్సు విషయంలో తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేవలం ఈ ఆర్డినెన్సు ను వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ మద్దతు కోసమే మొదటిసారిగా పాట్నాలో కాంగ్రెస్ తో కలిసి ప్రతిపక్ష వేదికను పంచుకునేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు.
 
కానీ, ఈ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో  కేజ్రీవాల్ ఆగ్రహానికి కారణమైంది. దీంతో చివరి వరకు వేచి చూసిన కేజ్రీవాల్ తాజాగా అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా శుక్రవారం నిర్వహించే ప్రతిపక్షాల ఐక్యత సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.
 
అయితే, బీఎస్పీతో పాటు బిజెడి, వైసిపి, బిఆర్ఎస్, టిడిపి లను ఈ భేటీకి ఆహ్వానించలేదని జెడియు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ భేటీ కోసం వివిధ పార్టీల నేతలు ముందుగానే పాట్నాకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గురువారమే చేరుకొని ఇటీవలె కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకుని కోలుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ,  ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్,  శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తదితరులు హాజరుకానున్నారు.