యోగా సార్వత్రికం, విశ్వజనీనం, ఘననీయం

యోగా సార్వత్రికం, విశ్వవ్యాపితం. దీనికి కాపీరైట్లు, పేటెంట్ హక్కులు ఉండవని, రాయల్టీలు అడిగే ప్రసక్తి లేదని తెలిపారు. యోగా జీవన క్రమం , యోగా వెసులుబాట్లతో కూడుకున్నది.  దీనిని సామూహికంగా జనారణ్యంలో నిర్వహించుకోవచ్చు. ఏకాంతంగా ఏ అడవిలో అయినా గదిలో అయినా తీరంలోనైనా ఆచరించవచ్చునని, గురుముఖత తెలుసుకోవచ్చు లేదా స్వయంగా గ్రహించవచ్చు, సమ్మిళితం చేసేందుకు , సహోదరత్వం పెంచేందుకు ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఐరాస వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగాదినోవ్సవ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ ఇది నిజంగా సార్వత్రికం, విశ్వజనీనం, ఘననీయం అన్నారు. వర్గభేదాలు, లింగవ్యత్యాసాలు, విశ్వాసాలకు అతీతం అయినదని , సంస్కృతులు సంప్రదాయలు భిన్నమైన సమిష్టిరీతిలో పాటించేందుకు వీలుండే సులువైన జీవన విధానం అని తెలిపారు.

ప్రధాని యోగా దినోత్సవ సందేశాన్నివివిధ దేశాల దౌత్యవేత్తలతో పాటు 134 దేశాల ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఆలకించారు. ప్రపంచ దేశాల ప్రాతినిధ్య సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఆవరణ వేదికగా న్యూయార్క్‌లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ  తమ మూడు రోజుల అమెరికా అధికారిక పర్యటనను ఇక్కడి యోగా దినోత్సవంలో ప్రధానంగా పాల్గొని ప్రారంభించారు. వేలాది మంది అంకితభావంతో మనసు తనువు లయలీనంగా యోగాను ఆచరించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ యోగా పాటించారు. ఐరాస భవనం ఉత్తరవైపు లాన్స్‌లో కార్యక్రమం జరిగింది.

శాస్త్ర సాంకేతిక రంగాలు, కళలు, వినోదాత్మక వేదికలకు చెందిన ప్రముఖులు , దౌత్యవేత్తలు , విద్యావేత్తలు, టెక్నోక్రాట్లు, రాజకీయ నాయకులు, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, మూడుసార్లు గ్రామీ విజేత రికీ కెజ్, సింగర్ ఫల్గుని షా, నటులు రిచర్డ్ గేరే, హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఐరాసకు చెందిన పలువురు అధికారులు ఇందులో తాము సైతం అంటూ పాల్గొన్నారు.

న్యూయార్క్‌లో యోగా గిన్నిస్ రికార్డు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ స్థాయిలో గిన్నిస్ రికార్డుల్లోకి చేరింది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమానికి ఈ సారి 134 దేశాల వారు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు రికార్డును ఛేదించింది. ఇంతకు ముందు ఏడాది ఈ యోగా దినోత్సవానికి 114 దేశాల వారు హాజరుకాగా ఇప్పుడు దీనికి 134 దేశాల ప్రతినిధులు వచ్చారని, ఇది రికార్డు అని ఐరాస తెలిపింది.

ప్రపంచ వైరుద్ధాలను భారతీయ యోగా ప్రక్రియతో అంతమొందించుకోవచ్చునని, ఈ అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోదీ  తెలిపారు. భారతదేశం సర్వదా వసుధైక కుటుంబ నినాదాన్ని ప్రవచించింది. తన విలువల ప్రక్రియలతో ప్రపంచానికి తరాలుగా చాటిందని ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బుధవారం ప్రధాని తరఫున ఓ వీడియో సందేశం వెలువరించారు.

ఆదరణ, ఆత్మీయతలను భారతదేశం తన సాంప్రదాయంగా మల్చుకుందని, పరస్పర వైరుద్ధాలను తొలిగించుకునేందుకు ఎల్లవేళలా పాటుపడాలనే జగద్విదిత నినాదం వెలువరించిందని తెలిపిన ప్రధాని ఈ దిశలో యోగా ఆచరణ ఓ సరైన మార్గం అని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ వినూత్న ఆలోచనలకు ఆహ్వానం పలికింది. వాటిని రక్షించింది. ఈ విధంగా దేశం సుసంపన్న వైవిధ్యతను సంతరించుకుందని ప్రధాని తెలిపారు.

అంతర్గత త్రికరణశుద్ధిని, మనోతేజాన్ని విస్తరింపచేసే భావనలు యోగాతో ప్రదీప్తమవుతాయి. దీనితో మనను ఈ సహోదర భావంతో అనుసంధానం అయ్యేందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. ప్రాణికి ప్రేమ ప్రాతిపదికను యోగా కల్పిస్తుందని చెప్పారు.

ఈసారి యోగా కార్యక్రమానికి విశిష్టత ఉంది. ధృవ ప్రాంతాలు అయిన ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో అత్యంత క్లిష్టమైన చోట వెలిసిన భారతీయ పరిశోధనా కేంద్రాల్లోని మన పరిశోధకులు యోగాను జరిపారని, ఇది గర్వకారణం అని ప్రధాని తమ వీడియో సందేశంలో తెలిపారు. మనందరి మనస్సులను కలిపే వారధి యోగా అని పేర్కొన్నారు.