వరుస హత్యలతో అజ్ఞాతంలోకి ఖలిస్థాన్ ఉగ్రవాదులు!

గత కొంత కాలంగా ప్రపంచంలో పలు ప్రాంతాలలో పలువురు కీలక ఖలిస్థాన్ ఉగ్రవాదులు అనూహ్యంగా వరుస హత్యలకు గురవుతూ ఉండడంతో వారిలో ఖంగారు బయలుదేరినట్లు తెలుస్తున్నది. వేర్పాటువాద కార్యకలాపాలు ఇటీవల కాలంలో పెరుగుతుండటం, వాటికి కళ్లెం వేసేందుకు భారత్ ప్రయత్నాలు సాగిస్తుండటంతో వారంతా అప్రమత్తమైన్నట్లు చెబుతున్నారు.
 
గత ఆరు నెలల్లో ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు అగ్రనేతల హత్యలు, అనుమానాస్పద మరణాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లలోని పలువురు ఖలిస్థానీ ఉగ్రవాదులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది.  అమెరికాలో ఉంటూ ఖలిస్థాన్ రిఫరెండం కోసం ప్రచారం సాగిస్తున్న గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ గత నాలుగు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
పన్నూ మాత్రమే కాదు, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, గ్రీస్‌ వంటి దేశాల్లోని ఖలిస్థానీ సంస్థకు చెందిన పలువురు ఉగ్రవాదులు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈనెల 18న కెనడాలోని సరోలో కాల్చివేతకు గురయ్యాడు. అతనిని నిషేధిత ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. కలిస్థాన్ వేర్పాటువాది అవతరా సింగ్ ఖాండా అనుమానాస్పద మృతి కూడా ఆయా దేశాల్లోని ఖలిస్థాన్ వేర్పాటువాదులు బెంబేలెత్తడానికి మరో కారణం.
 
టెర్నినల్ కాన్సర్‌తో యూకేలోని ఆసుపత్రిలో అతను చనిపోయాడు. అయితే, విషం కారణంగా అతను చనిపోయాడనే ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. గత మే నెలలో ఖలిస్థాన్ కమెండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పాంజ్వార్‌ను బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాహోర్‌లో కాల్చిచంపారు.  హర్మీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పీహెచ్‌డీ గత జనవరిలో లాహోర్‌లోని ఓ గురుద్వారా ఆవరణలో హతమయ్యాడు.
నార్కో-టెర్రర్, ఖలిస్థాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో అతని ప్రమేయం ఉందంటారు. కాగా, తన సహచరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఈనెల 18న కెనడాలో కాల్చిచంపినప్పటి నుంచి అమెరికాలో ఉంటున్న పన్నూ జాడ తెలియకుండా పోయింది.  పన్నూ, నిజ్జర్ కలిసి పనిచేయడంతో పాటు ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో కలిసి పర్యటించారు. ఖలిస్థాన్ రిఫరెండం క్యాంపైన్ నిర్వహించారు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌ (కేటీఎప్) చీఫ్‌గా ఉన్న నిజ్జర్ 2019లో పన్నూతో చేతులు కలిపాడు. కెనడాలో 2020లో రిఫరెండం క్యాంపైన్‌ను నాయకత్వం వహించాడు. ఖలిస్థాన్ సంస్థ “సిక్క్ ఫర్ జస్టిస్”లో గట్టి పేరు సంపాదించాడు. కెనడాలోని సరే, వాంకోవర్‌లలో కారు ర్యాలీలను కూడా నిర్వహించాడు.

భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో ప్రమేయమున్న గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల పలువురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతం కావడం, అవతార్ సింగ్ అనుమానాస్పద మరణం తర్వాత మౌనంగా ఉంటున్నాడు. నజ్జర్ కాల్చివేత ఘటనతో తన ప్రచారాన్ని ఆపివేసి, కేవలం ఆడియోలు, వీడియోల విడుదలకు పరిమితమయ్యాడు.