సామాన్యులకు చేరువ‌గా క్రూయిజ్ టూరిజం

సామాన్యులకు అందుబాటులోకి క్రూయిజ్ టూరిజంను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి మరింత హాని కాకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు.

భారతదేశపు పర్యాటక రంగాన్ని ప్రపంచలో అత్యుత్తమ  పర్యాటక దేశంలో మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని చెబుతూ  సాంస్కృతిక, భాషా వైవిధ్యత భారతదేశ పర్యాటకానికి బలమని ఆయన చెప్పారు.

గోవాలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాల సైడ్ ఈవెంట్ సందర్భంగా సోమవారం జరిగిన ‘మేకింగ్ క్రూయిజ్ టూరిజం మోడల్ ఫర్ సస్టేనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ట్రావెల్’, ‘టువర్డ్స్ ఎ సర్క్యులర్  ఎకానమీ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ టూరిజం – ద గ్లోబల్ టూరిజం ప్లాస్టిక్ ఇనిషియేటివ్’ అంశాలపై రెండు వేర్వేరు చర్చలను కేంద్రమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం, నిత్యం ప్రవహించే జీవనదులు భారతదేశంలో క్రూయిజ్ టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని చేపడుతున్నామని తెలిపారు. గంగానది ప్రక్షాళన, ఇతర నదుల పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్చతను ప్రోత్సహించే కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు గోవాలో జరగనున్న జీ20, సభ్యదేశాల పర్యాటక  మంత్రుల సమావేశంలో తీసుకునే ‘గోవా రోడ్ మ్యాప్’ ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. వివిధ దేశాలు వాతావరణ మార్పులపై ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్న సమయంలోనే భారతదేశం అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు.

గోవా రోడ్‌ మ్యాప్‌ను వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే జీ20 సమావేశాలలో చర్చిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.  ఇవాళ భారతదేశం 4వ అతిపెద్ద క్లీన్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, 4వ అతిపెద్ద పవన విద్యుత్ సామర్థ్య దేశంగా, 5వ అతిపెద్ద సౌర విద్యుత్ సామర్థ్య దేశంగా ఉందని, దీనికి ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవే కారణమని పేర్కొన్నారు.

అనంతరం, ఒమన్ పర్యాటక మంత్రి సలీమ్ బిన్ మహమ్మద్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్ జురాబ్ పోలోలీ కశ్విలీతో ద్వైపాక్షిక సమావేశాల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.