‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో 22న ప్రజల వద్దకు బిజెపి

నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈనెల 22న ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది.  పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరూ  ఈరోజు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు.

రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయి. ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు త,మ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఈనెల 22న వంద కుటుంబాలను కలిసి నరేంద్రమోదీ పాలనలో జరిగిన అభివ్రుద్ధిని వివరించడంతోపాటు ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ పంచనున్నారు. దీంతోపాటు స్టిక్కర్లను అంటించనున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిసహా రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు, జాతీయ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలంతా ఆరోజు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పర్యటించి ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలవనున్నారు.  మహా జన సంపర్క్ యాత్రలో భాగంగా ఈనెల 22 నుండి 30 వరకు ఇంటింటికీ బీజేపీ పేరుతో బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని కలిసి నరేంద్రమోదీ పాలనను వివరించడంతోపాటు ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాగా, మంగళవారం శక్తి కేంద్రాల వారీగా సమావేశం నిర్వహించి ఎవరెవరు ఏ గల్లీలో తిరిగి ప్రజలను కలవాలనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని బండి సంజయ్ సూచించారు. పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రతి కార్యకర్త ఏ ఇంటికి వెళ్లినా ఆ ఇంటికీ నరేంద్రమోదీ పాలనా విజయాలు, ప్రజలకు చేసిన మేలుపై ప్రచురించిన కరపత్రాలను పంచడంతోపాటు 90909024 నెంబర్ కు డయల్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చేలా చూడాలని కోరారు.

ఈనెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ‘‘యోగా డే’’ కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ ను శక్తివంతం చేయడమే లక్ష్యంగా  ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’  పేరిట ఈనెల 27 నుండి జూలై 5 వరకు  కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈనెల 27న కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని తెలిపారు.
 
‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ లో భాగంగా పార్లమెంట్ కు 10 మంది చొప్పున తెలంగాణ నుండి 170 మందిని ఎంపిక చేశామన్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోలింగ్ బూత్ కమిటీలపై బలోపేతంపై ద్రుష్టి సారిస్తారని చెప్పారు. తెలంగాణకు సైతం ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 900 మంది కార్యకర్తలు ఈనెల 27న వస్తున్నారని, వీరంతా 7 రోజులపాటు ప్రతి శక్తి కేంద్రంలో పర్యటించబోతున్నట్లు తెలిపారు.