నేతాజీ ఉండుంటే దేశ విభజన జరిగేది కాదు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ వారిని నిర్భయంగా ఎదిరించిన ధైర్యసాహసాలు కలిగిన నాయకుడని పేర్కొంటూ ఆ సమయంలో ఆయన ఉండుంటే దేశ విభజన జరిగి ఉండెడిది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌  దోవల్ స్పష్టం చేశారు.  ప్రముఖ వాణిజ్య సంస్థ ఆసోచామ్‌ ఆధ్వర్యంలో శనివారం మొదటిసారిగా నిర్వహించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రసంగిస్తూ  గాంధీని కూడా సవాలు చేసే ధైర్యం నేతాజీకి  ఉందని చెప్పారు. అయితే జాతిపితపై గౌరవంతో ఆయన మార్గానికి అడ్డుపడలేదని పేర్కొన్నారు.
 
భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిషర్లతో నేతాజీ పోరాడాలని నిశ్చయించుకున్నారని, స్వాతంత్ర్యం కోసం ఎన్నడూ యాచించలేదని పేర్కొన్నారు. ‘నేను బ్రిటీష్ వారితో పోరాడతాను.. నేను స్వాతంత్రం కోసం యాచించను.. అది నా హక్కు.. నేను దానిని పొందాల్సి ఉంటుంది’ అని బోస్ ఆలోచన అని దోవల్ చెప్పారు. రాజకీయ అణచివేతను అంతం చేయడమే కాకుండా ప్రజల రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆలోచనలను మార్చి స్వేచ్ఛా పక్షుల్లా ఆకాశంలో విహరింపజేయాలని భావించారని దోవల్ తెలిపారు.
నేతాజీ ఒక్కడిని మాత్రమే నాయకుడిగా అంగీకరిస్తానని మహమ్మద్‌ అలీ జిన్నా సైతం అప్పట్లో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ‘భారతీయ చరిత్ర లేదా ప్రపంచ చరిత్రలో ప్రవాహానికి ఎదురీదే సాహసం కలిగి ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు. సులభమైన ప్రవాహం కాదు. ఇది శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రవాహం. స్వాతంత్ర్యం, స్వేచ్ఛ తప్ప నేను దేనికీ రాజీపడనని నేతాజీ చెప్పారు’ అని దోవల్ పేర్కొన్నారు.

‘మరెవ్వరికీ లేని ధైర్యసాహసాలను బోస్ కలిగి ఉన్నారు.. పర్యవసానాలతో సంబంధం లేకుండా ప్రబలమైన శక్తులను సవాలు చేసే ధైర్యం ఆయనకు ఉంది. అతని ధైర్యం, దృఢ సంకల్పం ఐసిఎస్ కోసం లండన్‌కు వెళ్లడం నుంచి నిర్బంధ సమయంలో తప్పించుకునే వరకు అతని ధైర్యం స్పష్టంగా కనిపించింది’ అని దోవల్
వివరించారు.
 
బోస్ వారసత్వాన్ని హైలైట్ చేస్తూ విభిన్న నేపథ్యాల ప్రజలను ఏకం చేయగల నేతాజీ సామర్థ్యం గురించి, ఆయన ఏకీకృత, బలమైన భారతదేశాన్ని ఎలా ఊహించారనే దాని గురించి దోవల్ మాట్లాడారు. ‘బోస్ నాయకత్వం అసాధారణమైనది. కుల, మత, జాతి విభజనలకు అతీతంగా భారతదేశాన్ని వాస్తవికతగా గుర్తించారు.. అఖండ భారతదేశం గురించి ఆయన దృష్టి ప్రసిద్ధ నినాదం ‘కదం కదమ్ బాధయే జా’లో ఉంది’ అని చెప్పారు.

‘ఇది అన్ని వర్గాల ప్రజలతో ప్రతిధ్వనించింది. దేశం కోసం పోరాడటానికి వారిని ప్రేరేపించారు. వారి స్వేచ్ఛా సాధనలో ఐక్యంగా ఉన్నారు. బోస్ లౌకికవాది అయినా మతపరంగా నమ్మకం ఉంది. బోస్‌కు దేశభక్తి పట్ల ఉన్న మక్కువ, గొప్ప భారతదేశం గురించి ఆయన అచంచలమైన స్వప్నం ద్వారా అతని ప్రయత్నాలు నడిచాయి’ అని దోవల్ వివరించారు.

 ‘‘నేతాజీ సృష్టించిన జాతీయ వాదమే తనను భయపెట్టిందని 1956లో మాజీ బ్రిటిష్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ చెప్పారు. బ్రిటిషర్లు దేశాన్ని వదిలి పోవడానికి నేతాజీనే కారణమని ఆయన తెలిపారు. అటువంటి మహోన్నత వ్యక్తి నేతాజీకి చరిత్రలో సరైన గౌరవం దక్కలేదు’’ అని డోభాల్‌ విచారం వ్యక్తం చేశారు. అటువంటి నేతాజీ పట్ల చరిత్ర నిర్దయగా వ్యవహరించిందని, దాన్ని తిరగరాసేలా ప్రధాని మోదీ ప్రయత్నాలు చేయడం హర్షణీయమని తెలిపారు.