తుఫాన్ ప్రాంతంలో అమిత్ షా ఏరియల్ సర్వే

బిపొర్‌జాయ్ తుపాన్ తాకిడికి గురైన గుజరాత్ తీరం వెంబడిగల ప్రాంతాలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటరాగా ఆయన పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల భీభత్సపు తుపాన్ దశలో అధికార యంత్రాంగం, ఇతరత్రా కలిసికట్టుగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించారని ఈ సందర్భంగా అమిత్ షా జట్టు స్పూర్తి క్రమంతో సాగినందుకు అందరిని అభినందించారు. అరేబియా సముద్రంలో భారీ తుపాన్‌గా తలెత్తిన బిపొర్‌జాయ్ ఇప్పుడు తీరం తాకిన తరువాత బలహీనపడి రాజస్థాన్ వైపు తరలివెళ్లింది.

గుజరాత్ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఒక్కటి రెండు రోజులు పలు గ్రామాలు విద్యుత్ సరఫరాకు ఆటంకాలతో చీకట్లో మగ్గాయి. అయితే అధికార యంత్రాంగంతో పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ సమన్వయంతో వ్యవహరించిందని, ఇది నిజంగానే సత్ఫలితాలకు దారితీసిందని ఏరియల్ సర్వే తరువాత అమిత్ షా విలేకరుల సమావేశంలో తెలిపారు.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చక్కని సమన్వయం ప్రదర్శించాయని , దీనితోనే ప్రాణనష్టం లేకుండా గండం గడిచిందని, విపత్తుల దశల్లో ఇటువంటి టీంవర్క్ అత్యవసరం చెప్పారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాల మేరకు సరైన రీతిలో సహాయక చర్యలు చేపట్టారని, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం ఉండటం వల్ల భారీ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

దాదాపు 47 మంది స్వల్పంగా గాయపడ్డారని, ఎవరూ చనిపోలేదని, 234 పశువులు చనిపోయినట్లు అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి సహాయక బృందాల అధికారులను, వివిధ స్థాయిల సిబ్బందిని ప్రత్యేకంగా అమిత్ షా అభినందించారు.