మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి

మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా  స్వయంగా రంగంలోకి దిగి అన్ని వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ నిరసనకారులు వెనుకంజ వేయడం లేదు. తాజాగా గురువారం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ నివాసంపై దాడి చేసి, దహనం చేశారు.  ఇంఫాల్‌లో కర్ఫూ విధించడానికి నిరసిస్తూ  గురువారం రాత్రి కోంగ్బా  ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసాన్ని సుమారు 1200 మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంటిపై పెట్రో బాంబులు  విసిరారు.
కేంద్ర మంత్రి నివాసం పాక్షికంగా దెబ్బతిన్నదని, నివాస సముదాయంలోని కొన్ని తాత్కాలిక నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయని అధికారిక వర్గాలు తెలిపాయి.  అయితే కేంద్ర మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు మణిపూర్‌కు వెళ్లగా, ఆయన ఇంటిపై గుంపు దాడి చేసింది. అధికారిక పని నిమిత్తం తాను కేరళలో ఉన్నానని సింగ్ టెలివిజన్ ఛానెళ్లకు తెలిపారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
మంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండో సారి. గత నెలలో కూడా ఆందోళనకారులు చుట్టుముట్టగా.. భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. అయితే రాత్రి జరిగిన దాడిని మాత్రం అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్‌ కమాండర్‌ దినేశ్వర్‌ సింగ్‌ చెప్పారు.  రాత్రి పొద్దుపోయిన తర్వాత సుమారు 1200 మంది మంత్రి ఇంటిని చుట్టుముట్టారని, అన్ని వైపుల నుంచి పెట్రోల్‌ బాంబులు విసిరారని తెలిపారు. ఆ సమయంలో ఐదుగురు సెక్కూరిటీ గార్డులు, తొమ్మిది మంది భద్రత సిబ్బంది, మరో ఎనిమిదిమంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

మణిపూర్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి ఇంఫాల్‌లోని కొంగ్బాలో ఉన్న కేంద్ర మంత్రి రంజన్ సింగ్ నివాసంపై నిరసనకారులు దాడి చేశారు. ఇంఫాల్‌లో ఘర్షణలు చెలరేగడంతో రెండు ఇళ్లను తగులబెట్టారు. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య బుధవారం జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు, 10 మంది గాయపడ్డారు.

మే 3 నుండి కుకీ, మెయిటీ కమ్యూనిటీలకు చెందిన 120 మందికి పైగా మరణించారు. 350మందికిపైగా గాయపడ్డారు.  50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బుధవారం ఇంపాల్ వెస్ట్ లోని పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ నివాసంపై కూడా నిరసనకారులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో మంత్రి ఇంట్లో లేరు.

ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, వివిధ స్థాయుల్లో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. హింసాకాండకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించాలనే నిబద్ధత తమకు ఉందని పేర్కొన్నారు. తాము ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నామని చెప్పారు.

గవర్నర్ శాంతి కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. శాంతి కమిటీ సభ్యులతో చర్చలు, సంప్రదింపులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల మద్దతు, సహకారంతో త్వరలోనే శాంతిని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పరిస్థితి అకస్మాత్తుగా మెరుగుపడటం సులువు కాదని, అయితే హింసాత్మక సంఘటనలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు.

గృహ దహనాలు జరుగుతున్నాయని, నిందితులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. చట్ట ప్రకారం నిందితులను పట్టుకుంటామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మెయిటీ తెగవారు తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు తెలిపింది. దీంతో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మే 3 నుంచి ఆందోళన, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.