విశాఖ వైసీపీ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కలకలం

విశాఖపట్నంలో గురువారం కిడ్నాప్‌ కలకలం రేగింది. ఏకంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడులనే దుండగులు కిడ్నాప్‌ చేయడం సంచలనం  సృష్టించింది. రుషి కొండలోని ఎంపీ ఇంట్లో చొరబడ్డ దుండగులు ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌ లను బంధించారు. సినీ ఫక్కీలో చేజ్ చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
 
అనంతరం అడిటర్‌ ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్‌  గన్నమనేని వెంకటేశ‌్వరరావుకు ఎంపీ భార్యతో ఫోన్‌ చేయించారు. ఆడిటర్‌ వచ్చాక ముగ్గురినీ కిడ్నాప్‌ చేశారని తెలుస్తోంది. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ సమాచారం అందడంతో వేగంగా స్పందించిన ఎస్‌పి త్రివిక్రమ వర్మ వెంటనే ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి ఈ కిడ్నప్‌ను ఛేదించారు.
 
ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖలో ప్రముఖ బిల్డర్‌గా ఉన్నారు. ఉదయం ఆరున్నర, ఏడు గంటల మధ్య అగంతకులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కిడ్నాప్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఆడిటర్ జీవీ విశాఖలో ఎంపీ సత్యనారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ హైదరాబాద్‌లో ఉన్నారు.
 
సంఘటన జరిగిన 6 గంటల్లోనే నిందితులను విశాఖపట్నం -ఏలూరు హైవేలో అరెస్ట్‌ చేసినట్టు ప్రాధమిక సమాచారం. కిడ్నాపర్లు సత్యనారాయణ వద్ద నుండి రూ. 50 కోట్ల నగదు డిమాండ్‌ చేశారని సమాచారం. కిడ్నాప్‌ చేసిన ప్రధాన నిందితుడు రౌడీషీటర్ హేమంత్‌తో పాటు అతనికి సహకరించిన మరొక ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్‌ చేసి విశాఖకు తీసుకోవస్తున్నారు.
 
ప్రధాన నిందితుడు హేమంత్‌ కుమార్‌పై గతంలో 2 కిడ్నాప్‌ కేసులు, మర్డర్‌ కేసు ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డిని హత్య చేసిన కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తన భార్య, కొడుకు క్షేమంగా ఉన్నారని ఎంపీ సత్యనారాయణ ప్రకటించారు. కిడ్నాప్ జరిగిన వెంటనే దాదాపు 17 బృందాలతో నిందితుల్ని పోలీసులు వెంటాడారు. ఎంపీ ఇటీవల రుషికొండలో కొత్తగా ఇంటిని కట్టుకుని అందులోనే ఉంటున్నారు.
 
ఇదిలా ఉంటే కిడ్నాపర్లు.. 48 గంటల పాటు ఎంపీ ఇంట్లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. ఎంపీ సత్యనారాయణ మాత్రం రెండ్రోజుల నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆడిటర్ జీవీకి కాల్ చేయగా ఫోన్‌ స్విచ్ఛాఫ్ రావడంతో ఎంపీకి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు, ఆడిటర్ ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించారు. వెంటనే కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల చెర నుంచీ బాధితులను రక్షించారు.