బ్రిటన్ లోని ఖలిస్థానీ అవతార్ సింగ్ ఖండా మృతి

ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని హ్యాండ్లర్, బ్రిటన్‌లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (కెఎల్ఎఫ్) చీఫ్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైద్య నివేదికల ప్రకారం ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. గత రాత్రి యూకేలో ఒక ఆసుపత్రిలో మృతి చెందారు.

అవతార్ సింగ్ అండదండలతోనే అమృత్‌పాల్ సింగ్ ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో 37 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరగడం సాధ్యమైందని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, అవతార్ సింగ్‌పై విష ప్రయోగం జరిగినట్లు, ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ఆయన బాంబుల తయారీలో నిపుణుడని, మార్చి 19న జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా లండన్‌లోని హై కమిషన్ కార్యాలయం భవనంపై గల భారత దేశ జాతీయ పతాకాన్ని తొలగించడం వెనుక ఆయన పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈ సంఘటనలో కీలక నిందితుల్లో అవతార్ సింగ్‌తోపాటు మరో ముగ్గురు వేర్పాటువాదులు ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) గుర్తించింది.

అవతార్ సింగ్ కేఎల్ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ కుమారుడు. ఆయన స్టూడెంట్ వీసాపై 2007లో బ్రిటన్‌కు వెళ్లారు. 2012లో బ్రిటన్ ఆశ్రయం పొందారు. ఆయన రణ్‌జోధ్ సింగ్ అనే మారుపేరుతో కేఎల్ఎఫ్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది.

కేఎల్ఎఫ్ చీఫ్ హర్మీత్ సింగ్‌ను 2020 జనవరిలో పాకిస్థాన్‌లో హత్య చేశారు. ఆ తర్వాత అవతార్ సింగ్ ఈ సంస్థకు నాయకత్వం వహించారు. వారిస్ పంజాబ్ డే సంస్థకు చీఫ్‌గా దీప్ సిద్ధూ వ్యవహరించేవాడు. ఆయన మరణించిన తర్వాత అమృత్‌పాల్ సింగ్‌ను ఈ సంస్థకు చీఫ్‌గా చేయడంలో అవతార్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

37 రోజులపాటు పరారీలో ఉన్న అమృత్‌పాల్ ఏప్రిల్ 23న పంజాబ్‌లోని మోగాలో పోలీసులకు లొంగిపోయాడు. ఆయనను అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఉంచారు. అక్కడ ఆయన సహచరులు ఎనిమిది మంది కూడా ఉన్నారు.